telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వెనక్కి తగ్గిన బీజేపీ..ప్రమాణస్వీకారానికి సిద్దమైన ఉద్దవ్..

sivasena fire on bjp's words

మహారాష్ట్రలో ఒక రాత్రిలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే తరహాలో వెనకడుగు వేయాల్సి రావటంతో అక్కడి రాజకీయ వాతావరణం మారిపోయింది. అధికారం చేతులు మారబోతోంది. బుధవారమే బల పరీక్షను నిరూపించుకోవాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు బీజేపీకి ప్రతికూలంగా మారాయి. తొలుత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఆ వెంటనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాలను చేయాల్సి వచ్చింది. శివసేన సారథ్యంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు దారి సుగమం అయ్యింది. ఈ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ కూడా ఆరంభమైంది. ఇందులో భాగంగా- ప్రొటెం స్పీకర్ నియామకం పూర్తయింది. బీజేపీకి చెందిన సీనియర్ శాసన సభ్యులు కాళిదాస్ కోలంబ్కర్ ప్రొటెం స్పీకర్ గా నియమితులు అయ్యారు. బుధవారం ఉదయం 8 గంటలకు మహారాష్ట్ర ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్నట్లు నోటిఫికేషన్ సైతం విడుదలైంది. తొలుత- సంకీర్ణ కూటమి నాయకుడిని ఎన్నుకున్న తరువాత.. వారందరూ కలిసి ఉమ్మడిగా రాజ్ భవన్ కు వెళ్తారు. అధికారిక లేఖను గవర్నర్ అందజేస్తారు. ఈ లేఖపై 162 మంది శాసన సభ్యుల సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని, 170కి చేరుకుంటుందని అంటున్నారు కూటమి నాయకులు.

బుధవారం ఉదయం 8 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఆరంభం కానున్నాయి. కాళిదాస్ కోలంబ్కర్ తో ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం మొత్తం 288 మంది శాసన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. బుధవారం సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం ముగించేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. అనంతరం- ముఖ్యమంత్రిగా శివసేన అధినేత, సంకీర్ణ కూటమి నాయకుడు ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం ఉంటుందని అంటున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా కాంగ్రెస్ నుంచి బాలా సాహెబ్ థొరట్, ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రితో పాటే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.

Related posts