telugu navyamedia
క్రీడలు వార్తలు

సొంతంగా టీ20 లీగ్‌ను ప్రారంభించనున్న ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు…

బీసీసీఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఈ మెగా టోర్నీలో ఆడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లు కూడా కలలు కంటారు. ఇక యువ ఆటగాళ్లు అయితే అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే.. ఇక్కడ సత్తాచాటితే జాతీయ జట్టులో చోటు దక్కుతుంది. ఐపీఎల్ తర్వాత చాలా దేశాలు ఇలాంటి టీ20 లీగ్‌లను ప్రారంభించాయి. బిగ్ బాష్, పీఎస్‌ఎల్, సీపీఎల్ లాంటి టోర్నీలు వచ్చాయి. అయితే ఈ లీగ్‌లు ఐపీఎల్ తరహాలో ఆదరణ పొందలేదు. అయితే ఐపీఎల్ తరహా టీ20 లీగ్‌ను సొంతంగా ప్రారంభించనున్నట్టు తాజాగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. టీ20 లీగ్‌ను సొంతంగా ప్రారంభిస్తున్నట్లు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. మొదటి సీజన్ డిసెంబర్ 2021 నుంచి జనవరి 2022 మధ్య జరుగుతుందని సమాచారం. లీగ్ ప్రారంభించేందుకు యూఏఈ ప్రభుత్వంలోని శక్తిమంతమైన మంత్రి, ఈసీబీ చైర్మన్ అయిన షేక్ నహాయన్ మబారక్ అల్ నహాయన్ సహాయసహకారాలు ఉన్నట్టు తెలుస్తోంది. టీ20 లీగ్‌లకు యూఏఈ ఇప్పటికే ఆతిథ్యం ఇచ్చింది. 2014లో ఐపీఎల్ మొదటి భాగంకు, 2019లో పూర్తి లీగ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్‌ కొన్ని సీజన్లను కూడా నిర్వహించింది. తమ నిర్ణయానికి భారత్ సహా క్రికెట్ ఆడే దేశాల నుంచి మంచి స్పందన లభించిందని ఈసీబీ జనరల్ సెక్రటరీ ముబాషిర్ ఉస్మానీ ఓ ప్రకటనలో తెలిపారు. లీగ్ కోసం ఆసక్తి చూపిస్తున్న వారిలో కొన్ని ఐపీఎల్ జట్లతో పాటు ఇండియాలోని వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్లు ఉన్నట్టు ఈసీబీ తెలిపింది. మొదటగా ఆరు జట్లతో టీ20 లీగ్‌ను ప్రారంభించాలని ఈసీబీ నిర్ణయించింది. నెల రోజుల్లో వాటాదారులను నిర్ణయించనున్నట్టు, అనంతరం అందరం కలిసి కూర్చుని టోర్నమెంట్ విధివిధానాలను నిర్ణయిస్తామని ఉస్మానీ పేర్కొన్నారు.

Related posts