తెలుగు అకాడమీలో రూ.70 కోట్ల మేర నిధులు గల్లంతైన వ్యవహారంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మస్తాన్ వలి, పద్మావతి అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ బ్యాంకు మేనేజర్లు! తెలుగు అకాడమీలో నిధుల గోల్ మాల్ పై అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే.
తెలుగు అకాడమీ నిధులను డిపాజిట్ చేసేందుకు అధికారులు 34 బ్యాంకుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండడం దర్యాప్తుల్లో వెల్లడైంది. ఇప్పటివరకు నాలుగు బ్యాంకుల్లో అవకతవకలను గుర్తించిన సీసీఎస్ పోలీసులు, మిగతా బ్యాంకుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.
ఓ ప్రధాన బ్యాంకు నుంచి పలు సహకార బ్యాంకులకు నిధుల బదలాయింపు జరిగినా, అధికారులు అప్రమత్తం కాకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ బ్యాంకు ఖాతాలో రూపాయి జమ అయినా, విత్ డ్రా చేసినా ఫోన్ కు సందేశం వచ్చే వెసులుబాటును బ్యాంకులు కల్పిస్తున్నాయి. అలాంటిది కోట్లు బదిలీ జరుగుతుంటే అకాడమీ అధికారులు ఏం చేస్తున్నారన్నది ఆశ్చర్యం కలిగించే అంశం.