telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

స్వతంత్రులకే జై కొట్టిన .. కర్ణాటక మంత్రివర్గ విస్తరణ..

two independents got chance in ministry karnataka

కర్ణాటకలో ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. అసంతృప్త ఎమ్మెల్యేలకు, సీనియర్‌లకు చోటు దక్కుతుందని కొద్దిరోజులుగా కథనాలు వెలుడుతున్నప్పటికీ ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల వైపే ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం మొగ్గు చూపింది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ వాజుభాయి వాలా స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్‌.శంకర్‌, హెచ్‌.నగేశ్‌లతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర కూడా హాజరయ్యారు. కుమారస్వామి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనూ శంకర్‌ మంత్రిగా పనిచేశారు. అయితే గత డిసెంబర్‌లో ఆయన అనూహ్యంగా మంత్రివర్గం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించి నగేశ్‌తో కలిసి భాజపా వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని భాజపా పడగొట్టే సూచనలేవీ కన్పించకపోవడంతో వీరిద్దరూ యూటర్న్‌ తీసుకొన్నట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

ఈ ఇద్దరి చేరిక పట్ల అప్పుడే అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే శంకర్‌ చేతిలో పరాజయం పాలైన మాజీ స్పీకర్‌ కేబీ కోలివాడ్‌ మాట్లాడుతూ..శంకర్‌ను అవకాశవాది అని విమర్శించారు. వాస్తవానికి జూన్‌ 12నే ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ సినీనటుడు గిరీష్‌ కర్నాడ్‌ మృతి కారణంగా వాయిదా వేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌లు కలిసి పోటీ చేసినప్పటికీ రాష్ట్రంలోని 28 స్థానాలకు గానూ చెరొక స్థానంలో మాత్రమే విజయం దక్కింది. ఈ ఫలితాలను జీర్ణించుకోలేని ఇరు పక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్‌ నేతలు తమ రాష్ట్ర నాయకత్వంపై, సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.

Related posts