పశ్చిమబెంగాల్, భట్‌పర ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనంగా నిర్మించిన పోలీసుస్టేషన్ సమీపంలో జరిగిన ఘర్షణలో ఇరు గ్రూపులకు చెందిన వ్యక్తులు బాంబులు విసురుకున్నారు. తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో స్థానికంగా రోడ్డుపై వ్యాపారం చేసుకునే రాంబాబు షా అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు. క్షతగాత్రుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘర్షణల సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులతో పాటు రాపిడ్ యాక్సన్ ఫోర్స్(ఆర్‌ఎఎఫ్) బలగాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయి.
ఇరు గ్రూపులకు చెందిన వ్యక్తులను అక్కడి నుంచి చెదరగొట్టాయి. స్థానికంగా ఉన్న దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లను మూసివేయించి పరిస్థితులను తమ అదుపులోకి తీసుకున్నారు. గతనెల 19న ఉప ఎన్నికల సమయంలో కూడా భట్‌పర ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. కాగా, భట్‌పరలో నిర్మించిన ఈ పోలీసుస్టేషన్‌ను రాష్ట్ర డిజిపి గురువారం ప్రారంభించాల్సి ఉంది. డిజిపి మార్గమధ్యంలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రారంభోత్సవాన్ని నిలిపేసి పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.