telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

నేడు హాజరుకాకపోతే అరెస్ట్ తప్పదు!

Ravi Prakash

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌కు ఫోర్జరీ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సైబరాబాద్‌ పోలీసులు ఇప్పటికే సీఆర్‌పీసీ 160 ప్రకారం ఈనెల 9, 11వ తేదీల్లో రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు స్పందించిన రవిప్రకాశ్‌ తాను విచారణకు హాజరు అయ్యేందుకు 10 రోజుల సమయం కావాలని లాయరు ద్వారా కోరినట్లు సమాచారం. మరో నిందితుడు, సినీనటుడు శివాజీ ఇంతవరకూ పత్తాలేడు. బుధవారం ఉదయం పదకొండు గంటలకు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల ఎదుట రవిప్రకాశ్ హాజరుకావాల్సి ఉన్నది. అయితే ఆయన హాజరవుతారా లేదా అనే విషయంలో చర్చ జరుగుతున్నది.

సంతకాల ఫోర్జరీపై పక్కా ఆధారాలతో ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదుచేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించారని సమాచారం.రవిప్రకాశ్ ఫోర్జరీ చేశాడని చెప్తున్న సంతకంతోపాటు ఫోర్జరీకి గురైన వ్యక్తి అసలు సంతకాన్ని పోలీసులు ఇదివరకే సేకరించారు. ఆ రెండింటినీ పోల్చటంతోపాటు వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి, ప్రాథమిక నివేదిక కూడా తెప్పించినట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటే పోలీసులకు దొరుకడం ఖాయమని రవిప్రకాశ్ భావించి, ఏపీకి వెళ్లిపోయారని చెప్తున్నారు.  అక్కడే కొన్నాళ్లు తలదాచుకోవాలని రవిప్రకాశ్ భావిస్తున్నారన్న చర్చ నడుస్తున్నది. దీనితోపాటు ముందస్తు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలను కూడా మొదలు పెట్టినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో విచారణకు రవిప్రకాశ్ హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

Related posts