నిన్న భారత్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రమూకలపై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ప్రతి దాడికి సిద్ధం అవడంతో అమెరికా అధ్యక్షుడు స్పందించారు. తమ భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను పాకిస్థాన్ వెంటనే నాశనం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఏ ఒక్క ఉగ్రవాదికి మద్దతు పలికినా, అది దేశానికే చేటు తెస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం వియత్నాం పర్యటనలో ఉన్న ఆయన, మీడియాతో మాట్లాడుతూ, ఇండియాను కవ్వించే చర్యలు వద్దని పాక్ కు హితవు పలికారు.
ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను ధ్వంసం చేయకుంటే పాకిస్థాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉగ్రవాదంపై తీరును మార్చుకోవాలని ఎంతో కాలంగా పాక్ ప్రభుత్వాలను తాము కోరుతూనే ఉన్నామని, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కు కూడా అదే మాట చెబుతున్నామని అన్నారు. యుద్ధమే జరిగితే అత్యధిక నష్టం పాక్ కు జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు.