telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

చైనాను రెచ్చగొడుతున్న.. ట్రంప్.. తారాస్థాయికి వాణిజ్య యుద్ధం..

trump in america president election race

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాతో వాణిజ్య చర్చల పునరుద్దరణ జరుగున్న సమయంలోనే తన నోటిదురుసు నియంత్రించుకోలేకపోయాడు. చైనాకు వ్యతిరేకంగా ట్వీట్టర్‌లో పోస్టుల వర్షం కురిపించాడు. చర్చల్లో భాగంగా చివరకు జరిగే ఒప్పందాలను చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటుందని, తమ దేశ వ్యవసాయ ఉత్పత్తులను ఆ దేశం కొంటుందన్న ఆశ తమకు లేదని, ప్రస్తుతం చేసుకునే ఒప్పందాలను తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని వివాదాస్పదంగా స్పందించారు. ఇరుదేశాల మధ్య ఇటీవల నడిచిన వాణిజ్య యుద్దం తర్వాత చైనాతో తిరిగి వాణిజ్య చర్చలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రతినిధులు మంగళవారం షాంఘై నగరానికి చేరుకున్నారు.

ఇటీవల జపాన్‌లో జరిగిన జి-20 సమావేశాల సందర్భంగా వాణిజ్య యుద్దానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, చైనా అధ్యక్షుడు మధ్య సంధి చర్చలు నడిచాయి. అందులో భాగంగా అమెరికా ప్రతినిధులు చైనా అధికారులతో సమావేశమై పలు వాణిజ్య అంశాలపై కూలంకుషంగా చర్చించనున్నారు. దీనికి సంబంధించి ట్రంప్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘ చైనాతో చర్చలకు మా బృందం అక్కడకు చేరుకుంది. కానీ ఇటువంటి చర్చల ఒప్పందాన్ని చివరకు వారికి అనుకూలంగా మార్చుకుంటారు’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన చర్చల వైఫల్యానికి ముందే చైనా పలు ఒప్పందాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను చైనా కోనుగోలు చేయాలని తాము అశిస్తున్నామని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే ఆ దేశం నుంచి ఇప్పటివరకూ అటువంటి సంకేతాలు రాలేదని తెలిపారు. ‘ ఇదే చైనాతో వచ్చిన సమస్య. దేనికీ ముందుకు రారు’ అని అన్నారు.

అమెరికా ప్రతినిధులు షాంఘై చేరుకున్న తరువాత మీడియాతో మాట్లాడకుండా నేరుగా హోటల్‌కు వెళ్లిపోయారు. ట్రంప్‌ చేసిన ట్వీట్ల నేపథ్యంలో ఈ వారం కూడా ఇరు దేశాల మధ్య జరగనున్న వాణిజ్య చర్యలు విఫలమౌతాయనే దానికి బలం చేకూరుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2020, నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకూ వాణిజ్య చర్చలను చైనా ఆలస్యం చేస్తుందని తాను భావిస్తున్నట్లు ట్రంప్‌ గతవారంలో వ్యాఖ్యానించారు. ఏదేమైనా తాను గెలిచిన తర్వాత ఇప్పుడు జరుగనున్న చర్చల ఒప్పందాలను మరింత కఠినతరం చేయడమో లేక రద్దు చేయడమో చేస్తామని తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఒ)లో చైనాను అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో చేర్చకుండా ట్రంప్‌ అనేక అడ్డంకులు సృష్టించారు. దీనిపై చైనా తీవ్రంగా స్పందించింది. ఈ చర్య అమెరికా దురంహకారానికి, స్వార్థానికి నిదర్శమని మండిపడింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ హువావే సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టడం కూడా గతంలో చైనాకు కోపం తెప్పించింది. ఇరుదేశాల సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని, ఇటువంటి సమయంలో చైనాతో వాణిజ్య చర్చలు కావాలంటే అమెరికా గౌరవంగా వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Related posts