telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

హెచ్1బి.. తో స్థిర నివాస దిశగా.. ట్రంప్ నిబంధనలు..

trump new policies on h1b visa

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస వాదులపై మొదటి నుండి గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన కాస్త మెత్తబడినట్టుగా ఉంది, అందుకే విధాన ప్రక్రియలో సరళత్వం, స్థిర నివాసానికి సంబంధించి కచ్చితమైన హామీతో పాటు పౌరసత్వానికి వీలు కల్పించేలా హెచ్‌1బీ వీసా విధానంలో త్వరలో సమూల సంస్కరణలు తీసుకురాబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. సమర్ధత కలిగిన, అత్యంత నైపుణ్యవంతులు అమెరికాలో ఉద్యోగాలు చేయడాన్ని ప్రోత్సహించేలా కొత్త నిబంధనలు ఉంటాయన్నారు. ‘హెచ్‌–1బీ వీసాదారులు నిశ్చింతగా ఉండొచ్చు.

పౌరసత్వం, స్థిర నివాసం సహా మీకు ప్రయోజనం కల్పించే పలు మార్పులు త్వరలోనే రాబోతున్నాయి. ప్రతిభావంతులను మేం ప్రోత్సహించాలనుకుంటున్నాం’ అని శుక్రవారం ట్వీట్‌ చేశారు. హెచ్‌1బీ వీసాపై అమెరికాలో ఉంటున్నవారిలో అధికులు భారతీయ ఐటీ నిపుణులే కావడం గమనార్హం. ట్రంప్‌ ప్రకటన అమెరికా గ్రీన్‌కార్డ్‌ కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వేలాది భారతీయులకు శుభవార్తేనని భావిస్తున్నారు. ట్రంప్‌ అధికారం చేపట్టాక తొలి రెండేళ్ల పాటు హెచ్‌–1బీ నిబంధనలను కఠినతరం చేయాలని పట్టుబట్టడం తెలిసిందే.

అయితే ఇటీవలి కొద్ది కాలంగా ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని తాము ప్రోత్సహిస్తామనీ, మిగతా వలసలను బాగా తగ్గిస్తామని ట్రంప్‌ చెబుతున్నారు. హెచ్‌–1బీ వీసాకు దరఖాస్తు చేసుకున్న వాళ్లలో అత్యుత్తములనే ఎంపిక చేసేలా ప్రభుత్వం కృషి చేయాలని గత నెలలో హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగ మంత్రి కిర్‌స్టెన్‌ నీల్సెన్‌ చట్టసభ్యులకు తెలిపారు. ఉద్యోగ ఆధారిత వీసా మోసాలను గుర్తించి నిరోధించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసిందనీ, అమెరికన్‌ ఉద్యోగుల హక్కులను కాపాడాలంటే వలసయేతర వీసాల్లో సంస్కరణలు అవసరమన్నారు.

Related posts