telugu navyamedia
తెలంగాణ వార్తలు

సర్వసభ్య సమావేశంలో ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకు ప‌డ్డ కేటీఆర్‌..

జలవిహార్ లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. పార్టీ ఏర్పాటై 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా …. ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం.. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైన పరిస్థితుల గురించి మాట్లాడారు.

పార్టీకి 20 ఏళ్ళు నిండిన తర్వాత చరిత్ర గుర్తు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు మీడియా సపోర్ట్ లేదు.. సినీ గ్లామర్ లేదు. ఆరోజుల్లో కేసీఆర్ మెదక్ జిల్లా నాయకుడు మాత్రమే. చెన్నారెడ్డి నాయకత్వంలో 14 పార్లమెంట్ స్థానాలకు.. 11 స్థానాలు గెలిచినా తెలంగాణ రాలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ మడమ తిప్పలేదని ఆయన అన్నారు. 47 ఏండ్ల వయస్సులో కొత్తపార్టీ పెట్ట‌డం ఎందుకు.. తెలంగాణ ఉద్యమం ఎందుకు అని కేసీఆర్ ను చిన్ననాటి స్నేహితులు వారించినా ఆయన వినలేదు. ఒక్కడిగా మొదలైన కేసీఆర్ ప్రస్తానం.. ఉప్పెనెలా మారి రాష్ట్రాన్ని సాధించే వరకు ఆగలేదని ఆయన అన్నారు. రాజకీయ నాయకుల మీద ఉన్న అపనమ్మకం పోవాలంటే.. పదవులు తృణపాయంగా వదిలి పెట్టాలని నిర్ణయించుకున్నారు.

నిరాహార దీక్షతో కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించారు. టీ బీజేపీ, టీ కాంగ్రెస్ ల ముందు టీ ఉందంటే అది కేసీఆర్ పెట్టిన భిక్ష అనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ లీడర్లను ఏపీలో గంజిల ఈగల లెక్క చూసేటోళ్లు. కేసీఆర్ కాలిగోరుకు సరిపోనోళ్ళు కూడా.. ఇప్పుడు కేసీఆర్ ను తిడుతున్నరు. నోరు పారేసుకుంటున్నరు. నిన్న మొన్న పుట్టిన చిల్లర గాళ్ళు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు. పేరుకే అవన్నీ ఢిల్లీ పార్టీలు చేసేవి మాత్రం చిల్లర పనులు అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండి పడ్డారు మంత్రి కేటీఆర్. 70 ఏళ్లలో సాధించని ప్రగతి 7 సంవత్సరాలలో మేము సాధించి చూపించామన్నారు.

తెలంగాణ సుభిక్షంగా ఉంటే.. ప్రతిపక్షాలకు నచ్చట్లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాల తీరుకు ఇప్పటి నుంచి కుక్కకాటుకు చెప్పు దెబ్బ అనే రీతిలో స్పందిస్తాం అని ఆయన హెచ్చరించారు. ఇకపై ప్రతిపక్షాలు ఒక్కటంటే.. తెరాస పది అనేందుకు సిద్ధంగా ఉండాలి అని ఆయన పిలుపునిచ్చారు. పత్రికలలో హెడ్ లైన్ ల కోసమే.. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ప్రజా సంక్షేమం పట్ల వారికి చిత్తశుద్ధి లేదు. 60 లక్షల సభ్యత్వాలతో క్యాడర్ బేస్ గా టిఆర్ఎస్ ఎదిగింది ఇది చరిత్ర అని మంత్రి అన్నారు.

Related posts