telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేడు ఇందిరా పార్క్ వద్ద టీఆర్‌ఎస్‌ మహాధర్నా..

యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల పై కేంద్రం వైఖరికి నిర‌స‌న‌గా టీఆర్ఎస్ నేడు మహాధర్నాకు సిద్ధమైంది..ఈ సమస్య పరిష్కారం కోసం TRS కేంద్రంతో తాడో-పేడో తేల్చుకునేందుకు రెడీ అయింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనున్న ఈ ధర్నాలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్ పర్సన్లు ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. మధ్యాహ్నం ధర్నా ముగిసిన తర్వాత ఇందిరా పార్కు నుంచి పాదయాత్రగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నార‌ని స‌మాచారం.

యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టతనివ్వాలని బుధవారం ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారు. పంజాబ్ త‌ర‌హాలో తెలంగాణ‌లో కూడా ధాన్యం సేక‌ర‌ణ చేప‌ట్టాల‌ని , ఏటా ఉత్పత్తి పెరుగుతున్నా సేక‌రించే మొత్తం పెర‌గ‌ట్లేదని లేఖలో ప్రస్తావించారు. ఏడాదికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత బియ్యం కొనుగోలు చేస్తారో స్పష్టతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని సీఎం కేసీఆర్ డిమాండ్‌ చేశారు.

కాగా..ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా కేసీఆర్‌ వరి సేకరణపై కేంద్రం తన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం ధర్నాకు దిగి నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈనెల 12న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో టీఆర్ఎస్ ధర్నాలు నిర్వహించిన సంగతి తెలిసిందే

Related posts