telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెరాస ప్రచార హోరు .. మొదలు.. 16 లోక్ సభ స్థానాలే లక్ష్యం.. !

TRS Release Lok Sabha Candidates List

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖారావం పూరించనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాలను మరింత పరిపూర్ణం చేసేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయనున్నది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు దృఢ సంకల్పానికి అనుగుణంగా రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను 16 స్థానాల్లో తిరుగులేని విజయం సాధించి తదుపరి కేంద్రప్రభుత్వ ఏర్పాటులో టీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషించేలా వ్యూహాలు రచిస్తున్నది. ఈ క్రమంలోనే పార్లమెంటరీ నియోజకవర్గాలస్థాయి సన్నాహక సమావేశాలను బుధవారం నుంచి ప్రారంభించనున్నది. తొలి సమావేశం పార్టీకి ఆదినుంచి కలిసొచ్చిన గడ్డగా పేరొందిన కరీంనగర్‌లో ఏర్పాటుచేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావు పాల్గొనే ఈ సమావేశాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు పార్టీవర్గాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి.

కరీంనగర్‌లోని శ్రీరాజరాజేశ్వర డిగ్రీ కళాశాల (ఎస్సారార్) మైదానంలో నిర్వహించే ఈ సన్నాహక సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సారథ్యంలో ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. సభాస్థలి చుట్టూ భారీఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటుచేస్తున్నారు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలను పూర్తి చేసిన నాయకులు.. ప్రతి నియోజకవర్గం నుంచి మూడువేల మందికి పైగా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆ మేరకు సభాస్థలి వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభాస్థలిలో కూర్చునేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సీటింగ్ ఏర్పాటుచేస్తున్నారు. 25వేల మందికి వంటలు చేయిస్తున్నట్టు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలి సన్నాహక సమావేశానికి వస్తున్న కేటీఆర్‌ను స్థానిక పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతించాయి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం పదిన్నరకు కరీంనగర్‌కు వచ్చే కేటీఆర్‌కు మానేరు బ్రిడ్జి వద్ద భారీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి వేల వాహనాలతో సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యలో రాంపూర్ చౌరస్తా, కమాన్, సిక్కువాడి, కోర్టు చౌరస్తాలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతారు. ఇప్పటికే కరీంనగర్ మొత్తం గులాబీమయమైంది. ప్రతి చౌరస్తాలో గులాబీ జెండాలు, తోరణాలు ఏ ర్పాటుచేశారు. రహదారులు, చౌరస్తాల్లో కేటీఆర్‌కు స్వాగత ఫ్లెక్సీలు నెలకొల్పారు.

Related posts