మొన్నటి మంత్రివర్గ విస్తరణలో సీఎం కేసీఆర్ కేబినెట్ లో బెర్తులు దక్కని ఎమ్మేల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న ఎమ్మేల్యేల పై బీజేపీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని అరవింద్ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు. తన నివాసంలో ఈరోజు తనను షకీల్ కలిశారని తెలిపారు. రాష్ట్రంలోని, జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులు, పలు విషయాలపై లోతైన చర్చ జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా అరవింద్ కు షకీల్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ ఫొటోను అరవింద్ పోస్ట్ చేశారు.
ఈ సంఘటన టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. దీంతో షకీల్ పార్టీ మార్పుపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.మంత్రి పదవి రాకపోవడంతో షకీల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత టీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇంకా ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారనే విషయంపై ధర్మపురి అరవింద్ కు, షకీల్ కు మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.