హైదరాబాద్‌లో ఏపీ పోలీసులకు ఏం పని అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర పోలీసులు వచ్చి లోకేశ్వర్‌రెడ్డి ఇంటి మీద దాడిచేశారని తెలిపారు. ఫిర్యాదుపై విచారణకు వెళ్లిన తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు అడ్డుకోవడం పద్ధతేనా అని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్ అనే సంస్థ తప్పుచేయకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక ఫిర్యాదు వస్తే.. తెలంగాణ పోలీసులు విచారణ నిమిత్తం ఆ సంస్థ వద్దకు వెళ్లారని తెలిపారు.
ఇందులో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేసింది ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఉమ్మడి రాజధాని అయినా హైదరాబాద్ తెలంగాణ పోలీసు పరిధిలోకి వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. పోలీసులు విచారించి తప్పులేకుంటే క్లీన్‌చిట్ ఇస్తారని, దానికి ఏపీ పాలకులు భయపడాల్సిన పనిలేదని చెప్పారు. కంప్యూటర్ తానే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు.. ఆ కంప్యూటర్‌లో డాటాను దొంగతనం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీ ప్రజల సమాచారాన్ని వారి అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థకు ఇవ్వటానికి చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గుండాలన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పార్టీలకు అప్పనంగా అమ్ముకోవడమేంటని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రం పచ్చగా ఉంటే ప్రతిపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారు: మంత్రి అనిల్