చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో కథానాయిక ఎవరనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఎట్టకేలకు త్రిషను ఈ ప్రాజెక్టుకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఈ సినిమాలో మెగాస్టార్ పక్కన కనిపించనున్నారట. కథానాయిక ఎవరు? అనే విషయం గురించి ఇప్పటి వరకు దర్శక, నిర్మాతలు స్పందించలేదు. కానీ త్రిష స్వయంగా ఈ వార్తని నిజం చేశారు. ఓ సినీ విశ్లేషకుడు ఈ ఏడాది త్రిష మూడు సినిమాలతో అలరించబోతున్నారని జాబితాను ట్వీట్ చేశారు. మణిరత్నంతో ‘పొన్నియిన్ సెల్వన్’, మోహన్‌లాల్‌తో ఓ సినిమా, చిరంజీవి-కొరటాల శివ సినిమాలో ఆమె నటించబోతున్నారని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన త్రిష స్పందించారు. నిజమే అంటూ విక్టరీ ఎమోజీతోపాటు #2020 ట్యాగ్‌ను జత చేశారు.
దీంతో చిరు చిత్రంలో ఆమే అని నెటిజన్లు నిర్ధారించుకున్నారు. కానీ దర్శక, నిర్మాతలు మాత్రం కథానాయిక ఎవరు అనే విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల లాంఛనంగా పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. చిరు-త్రిష ఇది వరకు ‘స్టాలిన్’లో నటించారు. త్రిష కూడా తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఓ మంచి సినిమాతో టాలీవుడ్‌లో తిరిగి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చిరు సినిమాకు సంతకం చేసినట్లు తెలుస్తోంది.