tresma secretary on schools reopening

అందరం కలిసి…”మేధో తెలంగాణ”గా మార్చుకుందాం…

85

ప్రియమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధులు, యావత్ తెలంగాణ సమాజం అందరికి TRSMA ,తెలంగాణ తరపున నూతన విద్యా సంవత్సర ఆరంభ శుభాకాంక్షలు…. భారత దేశంలో విద్య ఎవరి సొత్తూ కాదు. విద్యా వ్యవస్థను దేశంలో పటిష్ఠ పర్చడం కేవలం ఒక వ్యవస్థ, రాష్ట్రం, ఒక కేంద్రం చేయలేదు. కాబట్టే రాజ్యాంగంలో విద్య ను “ఉమ్మడి జాబితా ” లో చేర్చారు. ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే విద్య అనేది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే పటిష్టంగా ఉన్నదంటూ ఇటీవల ఒక MEO, ఒక యూనియన్ వాళ్ళు వీడియో ను సోషల్ మీడియాలలో ప్రచారం చేశారు. రంగమ్మా మంగమ్మా అంటూ, ఈ గట్టునుంటావా ..ఆ గట్టునుంటావా అంటూ ఆడియోలు, ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేశారు, చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసుకోవడం కోసం, విద్యార్థులను ఆకర్షించేందుకు, తల్లిదండ్రులను ఆలోచింపచేసేందుకు వారి ప్రయత్నాలలో తప్పులేదు, సంతోషం. కానీ ఇటీవల మా TRSMA, తెలంగాణ(రంగారెడ్డి జిల్లా) తరపున అధ్యక్షులు తీగల కృపాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బోళ్ల శ్రీకాంత్ చిన్న బడ్జెట్ ప్రైవేటు పాఠశాలల ప్రత్యేకతను వివరిస్తూ, గణాంకాలతో ఒక వీడియో ను రూపకల్పన చేసి సోషల్ మీడియా లో పెట్టడం జరిగింది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ….సదరు యూనియన్ వాళ్ళు, వారి సోదరులు ఎదురుదాడి ప్రారంభించారు. ఆ వీడియో లో ప్రభుత్వాన్ని కించపరిచారని, ధర్నాలు, పత్రికా ప్రకటనలు చేస్తున్నారు.

వారి వీడియో లో ప్రైవేట్ పాఠశాలలను కించపర్చడం తప్పుకాదా..? తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడ చదివించు కోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది కదా.. మరి గ్రామాల్లో కి ప్రైవేటు పాఠశాలల బస్ లను రానివ్వొద్దని ఒకరు, పిల్లలను ప్రైవేటు లో చెర్చొద్దని తీర్మానాలు చేయించే వారు మరి కొందరు… ఇది సరైన విధానామా ..? ఇప్పటికే కార్పొరేట్ విద్యా సంస్థలు తమ అరాచకాలతో, ఫీజు ల దోపిడితో మొత్తం ప్రైవేట్ వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చాయి. తక్కువ ఫీజులు గల మా చిన్న బడ్జెట్ పాఠశాలల ప్రచారం కోసం ఒక వీడియో రూపొందిస్తే ఇంత గగ్గోలు అవసరమా..? మా పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టు కు, తరగతి కి ఒక ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఉంటారు.

మీ పాఠశాలల్లో ముఖ్యంగా ప్రాధమిక పాఠశాలల్లో తరగతికి/సబ్జెక్టు కు ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడా..? మా చుట్టుపక్కల ప్రభుత్వ పాఠశాలల్లో గమనించే మేము అడుగుతున్నాం. దీనికి ప్రభుత్వ ఉపాధ్యాయులు బాద్యులు కారు కానీ సంఘ నాయకులకు ప్రభుత్వ విద్య ను పటిష్టం చేసే బాధ్యత లేదా..? అవి పటిష్ఠం అయితే ఏ ప్రచారాలు మీకు అవసరం లేదు అని మాకూ తెలుసు. కాబట్టి సంఘ నాయకులు మా వీడియో పై బురద చల్లడం మానేసి, తమ అమూల్యమైన సమయాన్ని ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయడానికి ప్రణాళికలు వేసుకొని ప్రభుత్వం పై ఒత్తిడి తెండి. మావి తక్కువ ఖర్చుతో పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే బడ్జెట్ పాఠశాలలు. దోపిడీ చేసే వ్యవస్థను ఇప్పటికే నిర్వీర్యం చేసిన కార్పొరేట్ పాఠశాలలు కావు. G.O.No.1 గురించి ప్రభుత్వ సంఘాలు వ్యాఖ్యలు చేస్తున్నాయి. అది అన్ని రకాల పాఠశాలలకు వర్తిస్తుంది. కేవలం ప్రైవేటు కు మాత్రమే కాదు.

కాబట్టి మొదటగా మీ ప్రచారం కోసం మమ్మల్ని కించ పరిచింది మీరు…మీ వినూత్న ప్రచారానికి ప్రభావితమై, మేము కూడా మీరు చూపిన దారిలో పయనించాం… మాకు స్ఫూర్తి నింపిన మీకు ధన్యవాదములు…. గిల్లి కజ్జాలు మాని అందరం కలిసి చదువుల తల్లి “బాసర సరస్వతి” సాక్షి గా “మేధో తెలంగాణ”గా మార్చుకుందాం.

-యాదగిరి శేఖర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, TRSMA, తెలంగాణ.