telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేడు బీజేపీ విజ‌య‌ సంక‌ల్ప స‌భ‌.. భారీ బందోబస్తు

ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయం నుంచి బహిరంగ సభకు చేరుకునే మార్గంలో… వెయ్యిమంది పోలీసులను ప్రత్యేకంగా నియమించారు. రూఫ్‌టాప్‌ బందోబస్తు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సీసీ కెమెరాలు… ఇలా నాలుగంచెల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

కాగా బీజేపీ జాతీయ కార్యవర్గ రెండో రోజు సమావేశాల్లో రాజకీయ వ్యవహారాలతో పాటు వ్యవసాయం, అభివృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా దేశంలో వారసత్వ, కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయనున్నారు.
అలాగే రైతులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పథకాలు, నూతన వ్యవసాయ విధానం, రైతులకు లబ్ది వంటి అంశాలపై కొందరు ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలు ఈరోజు సాయంత్రానికి ముగియనున్నాయి.

నేటి మోడీ షెడ్యూల్‌ ఇదే.

నేటి ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సమావేశం సాయంత్రం 4:30 వరకూ కొనసాగనుంది. 4.30 నుంచి 5.40 వరకు రిజర్వ్‌.. సాయంత్రం 6.30 గంటలకు రోడ్డు మార్గంలో మోదీ పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకూ జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీ బస చేస్తారు. రేపు ఉదయం 9.20 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. బేగంపేట్ నుంచి విజయవాడకు మోదీ వెళ్లనున్నారు.

హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు.. 

పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం సాయంత్రం జరగనున్న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. హెచ్​ఐసీసీ, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, రాజభవన్‌, పంజాగుట్ట, బేగంపేట విమానాశ్రయం, పరేడ్‌ మైదానం చుట్టుపక్కల రోడ్లపై… నగరవాసులు ప్రయాణించడం మానుకోవాలని సీపీ ఆనంద్ కోరారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులు సకాలంలో చేరుకునేలా ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్‌ ప్లాట్‌ ఫారమ్‌ నంబర్‌ 1 వైపు నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకునేటప్పుడు ట్రాఫిక్‌ రద్దీ ఉంటుంది కాబట్టి ప్రయాణికులు చిలకలగూడ వైపు నుంచి ప్లాట్‌ఫాం 10 నుంచి స్టేషన్‌కు లోపలికి వెళ్లాలని సూచించారు.

Related posts