telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో అమరజవాన్ల కుటుంబాలు కేసీఆర్‌కు కనిపించడం లేదా?

తెలంగాణలో అమరజవాన్ల కుటుంబాలు సీఎం కేసీఆర్‌కు కనిపించడం లేదా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ సంద‌ర్భంగా గురువారం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు.

బీహార్‌ వరకు వెళ్లి అమర జవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించిన కేసీఆర్ .. కొండారెడ్డి పల్లెలో దళిత జవాన్ యాదయ్య 2013లో చనిపోతే పట్టించుకోలేదని విమర్శించారు. ఆయన భార్యకు ఉద్యోగం ఇస్తానని చెప్పి.. ఇప్పటి వరకు పట్టించుకోలేదని రేవంత్ ఆరోపించారు.

దేశ రాజకీయాల్లో ఏలాలన్న తపన తప్పితే.. తెలంగాణ జవాన్ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఆతృత కేసీఆర్‌కు లేదని రేవంత్ రెడ్డి అన్నారు.

అమరజవాన్‌ యాదయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, యాదయ్య కుటుంబానికి ఐదెకరాలు, ఇంటి స్థలం, బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని లేఖలో రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు

జవాన్ల మరణాలనూ కేసీఆర్‌ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని తప్పుబట్టారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా తెలంగాణ ప్రజల చెమట, రక్తం, కష్టార్జితాన్ని దేశమంతా తిరిగి పప్పుబెల్లాలు పంచినట్టు ఇచ్చేస్తున్నారని విమర్శించారు.

బిహార్ రాష్ట్రంలో పర్యటించి గాల్వన్ లోయ అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ తరఫున పరిహారం అందజేయడంలో సానుభూతి కంటే రాజకీయ, రాజ్యాధికార విస్తరణ కాంక్షే అధికంగా కనిపిస్తోందని విమర్శించారు

అంతకుముందు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై బుధవారం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇబ్రహీంపట్నంలో ఒక గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారని అన్నారు.

వాళ్లంతా నిరుపేదలేనని.. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని రేవంత్ ఆరోపించారు. అల్లుడు హరీశ్ సమర్ధుడని కేసీఆర్ ఆరోగ్య మంత్రిని చేశారని.. కానీ ఆయన హయాంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ బీహార్ పర్యటన చేయడం కాదని.. ఇక్కడ చనిపోతున్న వారిని పట్టించుకోవాలని టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి చేశారు

Related posts