telugu navyamedia
సినిమా వార్తలు

ఆత్రేయ మనసు నొచ్చుకున్న ఆ రెండు సంఘటనలు ..

తెలుగు సినిమాను సగటు ప్రేక్షకుడు దగ్గరకు చేర్చిన రచయితల్లో ఆచార్య ఆత్రేయ మొదటి స్థానంలో ఉంటాడు . ఆయన మాటలు, పాటలు కూడా చక్కటి భావంతో , భాషతో వుంటాయని విమర్శకులు సైతం చెబుతారు. అయితే కాలానుగుణంగా ఆయన మాటల్లో పాటల్లో ద్వందార్ధాలు వస్తున్నాయని, అందుకే ఆయన్ని బూత్రేయ అని కూడా వ్యగ్యంగా పిలిచేవారు . అయితే ఆ విమర్శ పక్కన పెడితే తెలుగు సినిమా ఎదుగుదలకు ఆత్రేయ తన రచనల ద్వారా ఎంతో దోహదం చేశాడని చెప్పవచ్చు .

ఆత్రేయ భౌతికంగా మనకు దూరమై మూడు దశాబ్దాలు అవుతుంది. .సోమవారం ఆత్రేయ 32వ వర్ధంతి . ఈ సందర్భంగా ఆయన ప్రతిభా పాటవాలు, వ్యక్తిత్యం గురించి తెలుసుకుందాం .ఆత్రేయ అసలు పేరు కిలాంభి వెంకట నరసింహా చార్యులు . ఆయన 7 మే 1921న నెల్లూరు లోని మంగళంపాడు గ్రామంలో జన్మించాడు .హైస్కూల్ విద్యాభ్యాసం అనంతరం ఆయన్ని స్వాతంత్రోద్యమం బాగా ఆకట్టుకుంది . నాయకుల విన్యాసాలకు ప్రభావితం అయ్యాడు . చిన్న వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని జైలు జీవితం అనుభవించాడు. జైలు జీవితం ముగిచాక బయటికి వచ్చి చిన్న వుద్యోగం చేశాడు కానీ అది అంత నచ్చలేదు. నెల్లూరులోని జమీన్ రైతు పత్రికలో సబ్ ఎడిటర్ గా చేరాడు . అప్పటికే అనేక నాటకాలు , నాటకాలు రాసి స్టేజి మీద ప్రదర్శింప చేశాడు . ఆత్రేయ రచనలను జనం బాగా ఇష్టపడేవారు , నాటకాలకు బహుమతులు కూడా వచ్చాయి .

ఆత్రేయ రాసిన నాటికల్లో , భయం, విశ్వ శాంతి, కప్పలు, గౌతమ బుద్ధ , సామ్రాట్ అశోక , పరివర్తనం, ఎదురీత , తిరుపతి ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి . ఆత్రేయలోని ప్రతిభను గమనించిన మిత్రులు సినిమా రంగంలోకి వెళ్ళమని సలహా ఇచ్చి , ప్రోత్సహించారు . మిత్రుల బలవంతం ,మనసులోని కోరిక ఆయన్ని మద్రాస్ వైపు నడిపించాయి. 1951లో దర్శకుడు కె .ఎస్ ప్రకాశరావు “దీక్ష ” అనే సినిమాలో ఆత్రేయను పరిచయం చేశాడు . ఈ చిత్రంలో “పోరా బాబు పో ” అనే పాట ఆరోజుల్లో బాగా పాపులర్ అయ్యింది . ఆత్రేయ మీద సినిమా వారి దృష్టి పడింది . అక్కడ నుంచి ఆత్రేయ సినిమా రంగంలో రచయితగా ప్రయాణం మొదలు పెట్టాడు.

అనతి కాలంలోనే ఆత్రేయ ప్రతిభను నిర్మాతలు , దర్శకులు గుర్తించారు . తమ సినిమాల్లో మాటలు రాయమని కొందరు , పాటలు రాసిపెట్టామని మరి కొందరు ఆయన మీద వత్తిడి తీసుకరావడం మొదలు పెట్టారు . ఆత్రేయ సామాన్యుడు కు కూడా సులభంగా అర్ధమయ్యేలా రాయడమే ఆయన విజయానికి దోహదం చేసిందని చెప్పవచ్చు . ఆరోజుల్లో మాటలు ,పాటలు రాస్తూ ఎంతో బిజీ గా ఉండేవాడు . ఆత్రేయ రాయక నిర్మాతల్ని, రాసిన తరువాత ప్రేక్షకులను ఏడిపిస్తారని నిర్మాతలు చెప్పేవారు .

ఆత్రేయ పెద్దగా చదువుకోక పోయినా జీవితానుభవంతో రాసే రాతలు ప్రజల మనస్సులో మెదులుతూ ఉండేవి.  ముఖ్యంగా మనసు గురించి ఆయన రాసిన మాటలు , పాటలు ఎంతో ఆకట్టుకునేవి . అలతి ,అలతి పదాల్లోనే జీవిత సారాన్ని హృద్యంగా చెప్పేవాడు .1989 లో వెంకటేష్ , రేవతి నటించిన సురేష్ ప్రొడక్షన్ వారి “ప్రేమ” ఆత్రేయ చివరి సినిమా. ఆ సినిమాలో మాటలు, పాటల్లో ఆత్రేయ ముద్ర కనిపిస్తుంది .ఆత్రేయ పై ప్రభావితం చూపించిన రెండు సంఘటనలు .

1964లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర రావు , సావిత్రి, జమున నటించిన “మూగమనసులు ” విడుదలైంది. ఈ సినిమాలోజమున ధరించిన గౌరీ పాత్ర కోసం ఆత్రేయ రాసిన ” మాను మాకును కాను .. రాయి రప్పను కానే కాను మామూలు మణిసిని నేను ..” పాట పెను దుమారం రేపింది . .

ఈ పాట రాసినప్పుడు కాగితాలు ఆత్రేయ ముఖంపై గిరాటేశారట . “ఆత్రేయా మతి వుండే రాశావా ? తాగి ఉన్మాద స్థితిలో రాశావా ? మాను మాకును కాను .. రాయి రప్పను కానే కాను .. ఏమిటిది ? ఇది పాటా ?” అని ఎగతాళి చేశారట .మూగమసులు సినిమాలో ఒక గొప్ప ప్రయోగం చేశానని ఆయన మురిసి పోతుంటే … ఈ మాటలు అమితంగా బాధించాయి, కన్నీళ్లు ఉబికి వచ్చాయి . బలవంతంగా ఆపుకుని .. “ఈ ఒక్క పాట నాకోసం ఉంచండి … మీలాగా జనం కూడా ఛీ కొడితే… ఇక నేను పాటలు రాయడం మానేస్తా ” అని చెప్పి వారిని ఒప్పించారట . సినిమా విడుదల తరువాత . ఆ పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలుసు .

ఇక అదే సంవత్సరం జగపతి రాజేంద్ర ప్రసాద్ తాను నిర్మిస్తున్న “ఆత్మ బలం ” సినిమాకు ఓ పాట రాయమని ఆత్రేయకు కబురు పంపించారు . జగపతి సంస్థ కాబట్టి ఆత్రేయ సరే అన్నాడు ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వర్ రావు, బి .సజోజాదేవి ప్రధాన జంట . వి. మధుసూదన రావు దర్శకుడు . మద్రాసులో ఉంటే ఆత్రేయ పాట రాయడని బెంగుళూర్ తీసుకెళ్లారు. అక్కడ పెద్ద హోటల్లో వున్నాం , రాజేంద్ర ప్రసాద్ గారి మర్యాదల గురించి చెప్పేదేముంది . ఏది కావాలన్నా క్షణాల్లో కళ్ళ ముందు ఉంటుంది . బెంగుళూరు లో వారం పది రోజులవుతున్నా ఆత్రేయ పాట కాదు కదా పల్లవి కూడా రాలేదు . రాజేంద్ర ప్రసాద్ గారు ఆత్రేయతో “డబ్బు అయిపోతుంది తప్ప మీరు పాట రాయడం లేదు”. ఆ మాటలకు ఆత్రేయలో కోపం వచ్చింది . “అంటే ప్రసాదు గారు నేను కావాలనే రాయడం లేదని మీ ఉద్దేశ్యమా ?” అని రోషంగా అన్నాడు .


ఆరోజు సాయంత్రం మనసు బాగాలేక కాస్త రిలీఫ్ కోసం గబ్బన్ పార్క్ కు వెళ్ళాడు . . పార్కు లో సందర్శకులు బాగానే వున్నారు. ఆత్రేయ అందరినీ చూస్తూ అలా తిరుగుతున్నాడు . కాసేపటి తరువాత మెల్లగా చినుకులు పడటం మొదలయ్యాయి . పార్క్ లో విహారానికి వచ్చిన జంటలు వర్షం పెద్దది అవడంతో ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని చెట్టు నీడకు వెడుతున్న దృశ్యం ఆత్రేయలో ప్రేరణ కలిగించింది . వెంటనే ఆయన మనసులో “చిటపట చినుకులు పడుతూవుంటే .. చెలికాడే సరసన ఉంటే.. “.అనే పల్లవి వచ్చేసింది . “ఆత్మబలం ” సినిమా లో ఈ పాట కుర్ర కారునే కాదు , వయసు మళ్ళిన జంటలను ఉర్రూతలూగించింది.

“పాట పుట్టుక పాపాయి పుట్టుక వంటిది. మంచి పాటకోసం చాలా కాలం వేచి వుండాల్చి వస్తుంది. పురిటి నొప్పులూ పడాలి” అంటారు ఆత్రేయ. మనసు కవి ఆత్రేయ ఎన్నో విలక్షణ మైన పాటలు రాశాడు . ఆ పాటలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటాయి .
– భగీరథ

Related posts