telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ కింగ్ నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు

టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున ఈరోజు 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61 వ జన్మదిన వేడుకలను జరుపుకోబోతున్నారు. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ్ విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అక్కినేని నాగార్జున ఆగష్టు 29, 1959న చెన్నైలో అక్కినేని నాగేశ్వర రావు, అన్నపూర్ణ దంపతులకి రెండవ సంతానం. బాలనటుడుగా నాగార్జున ‘సుడిగుండాలు’ చిత్రంలో నటించారు. ఈ చిత్రం 1967లో విడుదలైంది. నాగార్జున మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. నాగార్జున 1984లో ప్రముఖ నిర్మాత డాక్టర్ డి రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకే నాగచైతన్య జన్మించాడు. 1990 మొదటిభార్యకు లక్ష్మికి విడాకులు ఇచ్చి, 1992లో అమలను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి అఖిల్ జన్మించారు. ప్రస్తుతం నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

Nagarjuna

ఇక అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలను చూసుకుందామని నాగార్జున ముందుగా అనుకున్నారు. ఆ తరవాత హీరోగా 1986 లో ‘విక్రమ్’ సినిమాతో పరిచయం అయ్యారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రం నాగార్జునకి నటుడుగా మంచి పేరును తీసుకువచ్చింది. 1989లో వచ్చిన ‘శివ’ సినిమా ట్రెండ్ సెట్ చేసి తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచింది. ఈ సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక ఇదే సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు నాగ్. ఇక ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘హలో బ్రదర్’ సినిమా నాగ్ ని స్టార్ హీరోగా మార్చేసింది. ‘నిన్నే పెళ్ళడతా’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి గాను ఏకంగా తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. ‘నిన్నే పెళ్ళడతా’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘అన్నమయ్య’ లాంటి డివోషనల్ సినిమాతో నాగార్జున నటుడుగా మరో మెట్టు ఎక్కేశారు. ఈ సినిమాకి గాను నాగార్జున ఉత్తమ నటుడుగా నంది అవార్డు మరోసారి అందుకున్నారు.

Nagarjuna

ఆవిడా మా ఆవిడే, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, ఎదురులేని మనిషి మొదలగు సినిమాలు హీరోగా నాగార్జున స్థాయిని పెంచాయి. 2000 నుంచి 2002 మద్యలో నాగార్జున చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయాయి. ఇక 2002 లో వచ్చిన సంతోషం, మన్మధుడు సినిమాలు నాగర్జున క్రేజ్ ని పెంచాయి. ఈ రెండు సినిమాలకి గాను నాగ్ కి నంది అవార్డులు లభించాయి. ఆ తరువాత ‘శ్రీరామదాసు’ చిత్రాన్ని చేసి మంచి హిట్ కొట్టారు నాగార్జున. ఇదే తరహాలో ‘షిరిడి సాయి’ సినిమాలో కూడా నటించి మెప్పించారు నాగార్జున. ‘మనం’ సినిమాలో నాగ్ తన మొత్తం కుటుంబంతో కలిసి నటించాడు. తెలుగులో మరే హీరోకి కూడా ఇలాంటి ఘనత దక్కలేదు. ఆయన నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

Nagarjuna

కాగా నాగార్జున ఇప్పటివరకు ఒక జాతీయ అవార్డు (అన్నమయ్య), 9 రాష్ట్ర నంది అవార్డులు, 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నాడు. వెండితెర పైనే కాకుండా బుల్లితెర పైన కూడా నాగార్జున అదరగొట్టారు. మీలో ఎవరు కోటిశ్వరరుడు, బిగ్ బాస్ షోలు ఆయనకి మంచి పేరును తీసుకువచ్చాయి. ప్రస్తుతం నాగార్జున బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్ హీరోగా వస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు ధ‌నుష్ దర్శకత్వంలో ‘నాన్ రుద్రన్’, సాల్మొన్ దర్శకత్వంలో “వైల్డ్ డాగ్” చిత్రాలలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 6న “బిగ్ బాస్-4″తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగార్జున. అరవై సంవత్సరాలు వచ్చినా అమ్మాయిల మనసులో ఇంకా మన్మధుడు గానే ఉన్న కింగ్ నాగార్జునకు “నవ్యమీడియా” తరపున జన్మదిన శుభాకాంక్షలు.

Related posts