టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో మోసపోయిన జూనియర్ ఆర్టిస్ట్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని ఫిలింనగర్ జ్ఞాని జైల్ సింగ్ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న సదరు జూనియర్ ఆర్టిస్ట్ అనురాధకు కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది.
ఎలాగైనా కిరణ్ తనను పెళ్లి చేసుకుంటాడని భావించిన అనురాధ ఆ యువకుడితో సహజీవనం చేస్తోంది. కానీ ఇటీవలే మరో యువతితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం ఆమెకు తెలియడంతో ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమైయ్యాయి. ఆమెను వదిలించుకోవాలని భావించిన కిరణ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురైన అనురాధ తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ 306, 509, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.