థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. మీ అందరి ఆశీర్వాదం, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోరుకుంటున్నా అంటూ ఆ వీడియోలో ఆవేదన చెందుతూ మాట్లాడారు. గత 10 రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నానని, జలుబు తీవ్రంగా ఉండటంతో అన్ని టెస్టులు చేయించుకున్నానని పృథ్వీరాజ్ అన్నారు. అయితే ఆ టెస్టుల్లో కోవిడ్ నెగెటివ్ అని వచ్చినప్పటికీ ఓ 15 రోజులు క్వారంటైన్‌లో జాయిన్ అవ్వండి అని డాక్టర్లు చెప్పడంతో నిన్న అర్థరాత్రి ఆసుపత్రిలో చేరానని అన్నారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని అన్నారు. ఈ మేరకు మీ అందరి ఆశీర్వాదం, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. అయితే ఈ వీడియోలో ఆయన కనిపిస్తున్న కండీషన్ చూస్తుంటే కాస్త ఇబ్బందికర పరిస్థితే ఉందని తెలుస్తోంది. గతంలో సినిమాలతో బిజీగా ఉన్న పృథ్వీరాజ్ గత ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రచారం చేసి.. ఆ పార్టీ అధికారం లోకి వచ్చాక అనూహ్యంగా ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులయ్యారు. కొంతకాలం తర్వాత అక్కడ ఉద్యోగినితో పృథ్వీ రాసలీలలు సాగిస్తున్నారనే ఆరోపణలు రావడం, ఓ ఆడియో టేప్ బయటపడటంతో ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే అవన్నీ ఫేక్ కాల్స్ అని, తన ఎదుగుదల చూడలేక ఎవరో కావాలని చేస్తున్న కుట్రలని అప్పట్లో ఆయన పేర్కొనడం సంచలనంగా మారింది.
previous post
next post