telugu navyamedia
సినిమా వార్తలు

సుష్మా స్వరాజ్ కు టాలీవుడ్ ప్రముఖుల నివాళి

Sushma-Swaraj

బీజేపీ సీనియర్‌ నేత సుష్మా స్వరాజ్‌ (67) గత రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు నేటి సాయంత్రం లోధీ రోడ్ లోని శ్మశాన వాటికలో జరుగనున్నాయి. నిన్న రాత్రే ఆమె పార్థివ దేహాన్ని జంతర్ మంతర్ లోని నివాసానికి తరలించారు. పలువురు ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆమె అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. తొలుత ఆమె మృతదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకూ నేతల సందర్శనార్థం ఉంచుతారు. 3 గంటల తరువాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జంతర్ మంతర్ నుంచి బీజేపీ కేంద్ర కార్యాలయం వెళ్లే రోడ్డు మార్గాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

లాయర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన అనంతరం రాజకీయాల్లో చేరి, అనతికాలంలోనే దేశరాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌గా, మంచి మనసున్న నాయకురాలిగా ప్రజలకు దగ్గరయ్యారు. ఫిబ్రవరి 14, 1952న హర్యానాలోని అంబాలా కంటోన్మెంటులో సుష్మా స్వరాజ్‌ జన్మించారు. సుష్మాస్వరాజ్‌ విద్యార్థి సంఘం నాయకురాలిగా 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి,1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1996, 1998లో వాజ్‌పేయి మంత్రివర్గంలో పనిచేశారు.1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మోదీ కేబినెట్‌లో 2014 మే 26న కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు. సుష్మా స్వరాజ్‌ భర్త స్వరాజ్‌ కౌశల్‌ ప్రముఖ న్యాయవాది. ఆయన మిజోరాం గవర్నరుగా కూడా పనిచేశారు.

సుష్మ ఆకస్మిక మరణం పట్ల రాజ‌కీయ ప్ర‌ముఖులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. తెలంగాణతో.. తెలంగాణ ప్రజలతో ఆమెకి ప్రత్యేక అనుబంధం ఉన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు క్రమంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు బిల్లును ప్రవేశపెడితే సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించి.. మాటనిలుపుకున్నారు. వివిధ హోదాల్లో దేశానికి ఎన్నో సేవ‌లు చేసిన సుష్మా స్వ‌రాజ్‌కి టాలీవుడ్ కూడా సంతాపం ప్ర‌క‌టించింది. నితిన్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, మెహ‌రీన్, హ‌న్సిక‌, విష్ణు మంచు, సుధీర్ బాబు, శ్రీను వైట్ల‌, సాయిధ‌ర‌మ్ తేజ్ తమ ట్విట్ట‌ర్ ద్వారా సుష్మా ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరారు. దేశం గొప్ప నేత‌ని కోల్పోయింద‌ని వారు త‌మ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts