telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జగన్ ను కలిసే సినిమా బృందంలో కీలక వ్యక్తి?

Tollywood Big Wigs Meeting with AP CM Jaganmohan Reddy

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి ఆధ్వర్యంలో తెలుగు సినిమా ప్రతినిధులు మంగళవారం రోజు సమావేశం కాబోతున్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత తెలుగు సినిమా రంగ ప్రతినిధులు మొదటిసారి కలుసుకోబోతున్నారు. అంతకు ముందు ఒకరిద్దరు నిర్మాతలు కలిసిన, మెగాస్టార్ చిరంజీవి కలిసినా అది సినిమా సమావేశం కాదు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో చిరంజీవి, నాగార్జున, కొంత మంది నిర్మాతలు, దర్శకులు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం సినిమా పరిశ్రమ వారితో జరిగింది కాదని, కేవలం చిరంజీవి ఆయన సన్నిహితుల సమావేశమనే విమర్శలు వచ్చాయి. దీనిపై నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. అందుకే అలాటి వ్యాఖ్యలు, విమర్శలకు తావులేకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలిసే ప్రతినిధి వర్గంలో అందరి ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్త పడినట్టు తెలిసింది. చిరంజీవి నాయకత్వంలో ఈ ప్రతినిధి బృందంలో నాగార్జున, జి.ఆదిశేషగిరావు, అరవింద్, సురేష్ బాబు, కె.ఎల్.నారాయణ, ఎన్వీ.ప్రసాద్, జెమినీ కిరణ్, ఎస్.ఎస్.రాజమౌళి, కొరటాలశివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఛాంబర్ ప్రెసిడెంట్ నారంగ్, కార్యదర్శులు దాము, ముత్యాల రమేష్, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్, కార్యదర్శులు తుమ్మల ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్, కార్యదర్శి జీవిత, ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు కొమర వెంకటేష్ తో పాటు జగన్మోహన్ రెడ్డి క్లాస్ మేట్ యార్లగడ్డ సుమంత్ వున్నారు.

Chiru

వీరంతా మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కారుల్లో బయలుదేరి లంచ్ టైమ్ కు అమరావతిలో వున్న గోకరాజు రంగరాజు గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. సినిమా ప్రముఖుల కోసం ప్రత్యేక వంటకాలను తయారు చేయిస్తున్నట్టు తెలుస్తుంది. కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకున్న తరువాత సరిగా మూడు గంటలకు జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వెడతారు. అక్కడ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వీరిని సాదరంగా ఆహ్వానిస్తారు. అక్కడ సమావేశంలో ఎఫ్.డి.సి చైర్మన్ విజయచందర్, సమాచార శాఖ కమీషనర్, ఎఫ్.డి.సి.ఎండి విజయకుమార్ రెడ్డి మరికొంత మంది అధికారులు పాల్గొనే అవకాశం వుంది.

Chiru
ఆంధ్రప్రదేశ్ లో సినిమా అభివృద్ధి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం వుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షూటింగ్ జరుపుకునే నిర్మాతలకు లొకేషన్ అనుమతులు అవ్వడమే కాకుండా ఎలాంటి చార్జీలు ఉండవని ప్రకటించారు. తెలుగు నిర్మాతల మండలి వైజాగ్ లో సినిమావారికి ఇళ్ల స్థలాలు కేటాయించామని లేఖ రాయడం జరిగింది. మంగళవారం రోజు చిరంజీవి, నాగార్జున ఒక మెమొరాండం, నిర్మాతల మండలి తరుపున ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చే అవకాశం వుంది. జగన్ మోహన్ రెడ్డితో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న సుమంత్ ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలిసింది. సుమంత్ ద్వారా తమ కోరికలు జగన్ ముందు ఉంచాలని ఈ ప్రతినిధుల బృందం భావిస్తుంది.

– భగీరథ
సీనియర్ జర్నలిస్ట్.

Related posts