తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి అతిథిగా విచ్చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన అనంతరం జగన్ హైదరాబాద్ లో కేసీఆర్ నివాసానికి వెళ్లగా అపూర్వ స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నేడు జరిగే తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలంటూ కేసీఆర్ ను జగన్ ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ గురువారం హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 11 గంటలకు గన్నవరం చేరుకోనున్నారు.
అటునుండి 11.25కి గేట్ వే హోటల్ కు చేరుకుని, మధ్యాహ్న భోజనం పూర్తి చేసుకోనున్నారు. ఆపై 12.08 గంటలకు జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి వేదికగా నిలిచే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీ పయనమవుతారు. అక్కడ నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. కేసీఆర్ తో పాటు జగన్, గవర్నర్ నరసింహన్ కూడా ఒకే విమానంలో ఢిల్లీ వెళతారని తెలుస్తోంది.