telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇవాళే దుబ్బాక ఉపఎన్నిక రిజల్ట్…

తెలంగాణలో ఏంటో ఉత్కంఠభరితంగా సాగిన దుబ్బాక ఉపఎన్నిక ఫలితం నేడు తేలనుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు సిద్దిపేటలోని ఇందూరు కాలేజీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. ఒంటిగంటకల్లా పూర్తి ఫలితం రానుంది. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఓటర్లు లక్షా 98 వేల 766 మంది ఓటర్లు ఉండగా, లక్షా 64 వేల 192 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం వృద్ధులు, వికలాంగులకు 1,453 మంది పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు వేశారు. 51 సర్వీస్ ఓట్లు నమోదయ్యాయి. గతంలో ఒక్కో హాలులో 14 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్లను లెక్కించేవారు. కోవిడ్ కారణంగా ఒక్కోదానిలో ఏడు చొప్పున రెండు హాళ్లలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈ లెక్కన 23 రౌండ్లలో ప్రక్రియ పూర్తి కానుంది. పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. కౌంటింగ్ ప్రక్రియలో 200 మంది సిబ్బంది పాల్గొంటారు. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్‌వైజర్, సహాయకులు, సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు.

అభ్యర్థులు 15 మంది చొప్పున ఏజెంట్లను నియమించుకునే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థికి లేదా ఆయన ఏజెంటుకు అనుమతి ఇస్తారని అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 357 మంది పోలీసులను మోహరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు 144 సెక్షన్ విధించారు. ఆరుగురు ఏసీపీలు 18 మంది సీఐలు, 38 మంది ఎస్ఐలు, 16 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 229 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మహిళా పీసీలు 50 మంది విధుల్లో ఉంటారు. ఏడు సెక్టార్లుగా విభజించి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. సీపీ జోయల్ వీటన్నింటినీ పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేవారికి ప్రత్యేక పాస్​లు జారీ చేశారు. కాగా, 2018లో టిఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కరోనాతో మరణించడంతో ఈ ఎన్నిక జరిగింది. టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి భార్య సుజాత, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన రావు, కాంగ్రెస్ నుంచి చెరకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి సహా 23 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేసారు. అందులో విజయం ఎవరిని వరిస్తుంది అనేది చూడాలి.

Related posts