విశాఖ కేజీహెచ్‌లో శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివదేహాన్ని ఎంబామింగ్ చేసి రోడ్డుమార్గంలో తిరుపతిలోని ఆయన స్వగృహానికి తరలించారు. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం మధ్యాహ్నం వరకు సందర్శనార్థం తిరుపతిలోని సరోజినీదేవి లేఔట్‌లో పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం గోవిందధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.
విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. సోమవారం వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస విడిచారు.
1944లో తిరుమలలో జన్మించిన డాల్లర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. ఆయన పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు. శేషాద్రి తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించారు. తిరుమలలో పుట్టి.. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శేషాద్రి… అప్పట్లోనే పీజీ అభ్యసించారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైర్ అయినా శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో ఓఎస్డీగా టీటీడీ కొనసాగించింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు.
కాగా..అంత్యక్రియలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు తితిదేకు హాజరుకానున్నారు.