తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబురాలు అంగరాన్నంటున్నాయి. తొమ్మిది రోజుల పాటు ప్రతీ రోజు సాయంత్రం పూలతో బతుకమ్మను పేర్చి పూజించుకుంటారు. తెలంగాణలోని వాడ వాడలా ఎక్కడ చూసినా పూల సందడే కనిపిస్తోంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఇప్పటికే ఐదు రోజులు బతుకమ్మ వేడుకల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో తెలంగాణ ఆడబిడ్డలు ఆటపాటలతో సందడి సందడిగా జరిగాయి.
ఆరవరోజు పూలతో బతుకమ్మను పేర్చరు. దీనికో కథ ఉంది. పూర్వకాలంలో ఆరవరోజు బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్దా తగిలిందని అది అపచారమని భావించిన బతుకమ్మను పేర్చరు. అందుకే బతుకమ్మా.. అపచారం జరిగిపోయింది..మా అపచారాన్ని మన్నించు తల్లీ అంటూ వేడుకుంటారు. మా మీద అలగవద్దు బతుకమ్మా..ఆగ్రహించవద్దు..నీ బిడ్డలం మమ్మల్ని కరుణించు..అని వేడుకుంటారు ఆడబిడ్డలు. అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. ఆమెకు ఈ రోజు ఏ నైవేద్యం ఉండదు. అందుకే ఆరవ రోజు బతుకమ్మను తయారు చేయరు.