ఏపీ కి మూడు రాజధానులు ఏర్పాటు అవుతాయేమో అని సీఎం జగన్ అన్నప్పటి నుండి జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ప్రకటన చేసినప్పటి నుంచి రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది. అంతేకాకుండా ఈ నిర్ణయాన్ని కొంతమంది అంగీకరిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ, జనసేన అమరావతే రాజధానిగా ఉండాలని అంటుంటే.. అధికార వికేంద్రీకరణకు మూడు రాజధానులు అవసరమేనంటూ బీజేపీ మద్దతు పలికింది. అయితే ఇప్పుడు తాజాగా మాకు నాలుగో రాజధాని కావాలంటూ కొత్త డిమాండ్ పుట్టుకొచ్చింది.
ఏపీకి నాలుగు రాజధానులు ఉండాలని రాయలసీమ పోరాట సమితీ భావిస్తుంది. వెంకన్న సన్నిధి అయిన తిరుపతిని ఏపీకి ఆధ్యాత్మిక రాజధానిని చేయాలంటూ సమితీ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ చేయకపోతే ఉద్యమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు. పీఎం నుంచి సీఎం దాకా అందరూ వచ్చి సందర్శించుకునే తిరుపతిని ఎందుకు రాజధానిని చేయరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో మూడు రాజధానులపై రచ్చ జరుగుతుంటే.. సడన్‌గా తెరపైకి వచ్చిన ఈ నాలుగో రాజధానితో రాజకీయంగా ఎంతటి చర్చకు దారి తీస్తుందో వేచి చూడాలి. కాగా, ఇవాళ సాయంత్రం నిపుణుల కమిటీ రాజధాని విషయంపై సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. దీంతో సీఎం ప్రకటనపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.