telugu navyamedia
ఆంధ్ర వార్తలు సామాజిక

అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా శరన్నవ రాత్రుల సందర్భంగా తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభించారు. 

బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులు ధ్వజపటం ఎగురవేసి ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. శ్రీవారి వాహన సేవలను ప్రారంభించారు. కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన ప్రధాన ఘట్టమైన గరుడసేవ జరగనుంది. ఆరోజున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

తొలిరోజు పెదశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని ఆలయ మండపంలో కొలువుదీర్చి వాహన సేవలు నిర్వహించారు. స్వామివారి వాహనాన్ని విశేషంగా అలంకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఈవో, అదనపు ఈవో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలిరోజు పెదశేష వాహన సేవ కన్నుల పండువగా జరిగింది. ఈ సేవలో శ్రీనివాసుడు శేషతల్పంపై అధిష్టించి దర్శనమిచ్చారు.

Related posts