కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు.. తిరుమలకు భక్తులకు పోటెత్తారు. వేసవి సెలవులు, వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గరుడ సేవ, వైకుంఠ ఏకాదశి రోజుల్లో తిరుమలకు తరలివచ్చిన రీతిలో భక్తులు సర్వదర్శనానికి వస్తున్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు నిండి సుమారుగా 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో సర్వదర్శన క్యూలైన్లు వెంగమాంబ అన్నదాన సత్రం దాటిపోయింది.
సాధారణంగా గంటకు 4500 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. అయితే గంటకు సుమారు 8 వేల మందికి దర్శనం కల్పించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఈ పరిస్థితి తప్పలేదని టీటీడీ అధికారులు ప్రకటించారు.
తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా భక్తులు తరలివస్తున్నారని తితిదే ఈవో ధర్మారెడ్డి చెప్పారు. శ్రీవారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం పడుతోందని.. భక్తులు రద్దీ దృష్ట్యా మూడు రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు.
శుక్రవారం నుండి భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. శనివారం నాటికి ఈ సంఖ్య మరింతగా పెరిగింది. శనివారం శ్రీవారిని 89,318 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
మూడు రాజధానులపై బొత్స ఆసక్తికరవ్యాఖ్యలు..