telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు : సీఎం జగన్‌ నివాళులు

జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రారంభించారు.

ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. అనంత‌రం పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సీఎం ప్రారంభించారు.

పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే మాధ్యమిక విద్యను మచిలీపట్నంలో పూర్తిచేసి సైనికుడిగా చేరారు. దక్షిణాఫ్రికాకు వెళ్లిన సమయంలో గాంధీజీని కలిశారు. ఆయన ప్రసంగాలకు ఆకర్షితుడై భారత్ కు తిరిగొచ్చారు. దేశానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలన్న తపనతో మువ్వన్నెల జెండాను రూపొందించారు. విజయవాడలో జరిగిన సభల్లో స్వల్ప మార్పులతో ఆమోదం పొందారు. ఆ త్రివర్ణ పతాకమే కోట్లాది భారతీయుల హృదయాల్లో దేశభక్తిని ప్రతిబింబించే గొప్ప చిహ్నంగా ఖ్యాతి గడించింది.

పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా..పింగళి వెంకయ్య స్వస్థలం కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో జరిగే కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, నగరిలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే పింగళి వెంకయ్యపై రూపొందించిన ప్రత్యేక కవర్‌ను పోస్టల్‌ శాఖ ఆవిష్కరించనున్నారు.

Related posts