telugu navyamedia
క్రీడలు వార్తలు

రూటు మార్చిన టిమ్ పైన్… భారత్ పై ప్రశంసలు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని పైన్ కొనియాడాడు. అతన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపాడు. తాజాగా అతను మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘కోహ్లీ గురించి గతంలో చాలాసార్లు చెప్పాను. అతని లాంటి ఆటగాడిని ఏ కెప్టెన్‌ అయినా తమ జట్టులో ఉండాలని కోరుకుంటారు. అతను గట్టి పోటీనిచ్చే క్రికెటర్ మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. ప్రత్యర్థి జట్టుగా కోహ్లీతో ఆడటం సవాలుగా ఉంటుంది. అయితే, తన ఆటతో అవతలి వారికి చికాకు, విసుగు తెప్పిస్తాడు. అతను తన పోటీతత్వంతో మనల్ని కూడా పోటీపడేలా చేస్తాడు. అతనితో నాలుగేళ్ల క్రితం వాగ్వాదం మొదలైంది. నేనెప్పటికీ గుర్తుంచుకునే ఆటగాళ్లలో కచ్చితంగా టీమిండియా కెప్టెన్ ఒకడు’ అని పైన్‌ చెప్పుకొచ్చాడు. అయితే ‘భారత జట్టలో విరాట్‌ ఒక ఆటగాడు మాత్రమే. అతని గురించి పెద్దగా ఆందోళన చెందట్లేదు’ అని గత ఏడాది భారత్‌తో సిరీస్‌ ముంగిట పైన్‌ వ్యాఖ్యానించడం విశేషం. పైన్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా 2018-19లో కోహ్లీసేన చేతిలో స్వదేశంలో టెస్టు సిరీస్‌ ఓడింది. మళ్లీ గత ఏడాది చివర్లో ఆరంభమైన సిరీస్‌లో తొలి మ్యాచ్‌ తర్వాత కోహ్లి స్వదేశానికి వచ్చేసినా, సిరీస్‌ మధ్యలో కీలక ఆటగాళ్లు గాయపడినా టీమ్‌ఇండియా అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఈ సిరీస్‌లో భారత జట్టు తమ దృష్టి మళ్లించి సిరీస్‌ గెలిచిందని ఇటీవల పైన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Related posts