telugu navyamedia
ఆంధ్ర వార్తలు

శ్రీశైలం డ్యామ్మూ డు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన మంత్రి అంబటి

*శ్రీశైలం డ్యామ్ మూడు గేట్లు ఎత్తి నీటిని విడుద‌ల‌
*కృష్ణ‌మ్మ‌కు పూజ‌లు చేసిన మంత్రి అంబ‌టి రాంబాబు..

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శ్రీశైలం ప్రాజక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ క్ర‌మంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. మూడు రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా ర‌విచంద్ర కిషోర్ రెడ్డి‌, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రాజెక్టు వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు.

ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 202.04 టీఎంసీలు ఉంది.ఇన్‌ఫ్లో 1,27, 980 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ ఫ్లో 74,365 క్యూసెక్కులు ఉంది.కుడి, ఎడమ గట్ల విద్యుత్‌ కేంద్రాల్లో కరెంట్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో 882 అడుగుల్లో స్థిరంగా నీటిని నిల్వ చేస్తూ.. మిగులుగా ఉన్న నీటిని స్పిల్‌ వే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా..శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో అక్కడి నుంచి కృష్ణమ్మ దిగువకు పరవళ్లు తొక్కుతుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఓ వైపు ప్రాజెక్టు అందాలను వీక్షించడంతో పాటుగా.. మరోవైపు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకునేందుకు పర్యాటకులు, భక్తులు శ్రీశైలంకు వస్తున్నారు.

Related posts