telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అయోధ్య కేసు అడ్వొకేట్ రాజీవ్ ధవన్ కు .. బెదిరింపులు .. రక్షణ కోసం పిటిషన్..

threatening call to ayodya advocate

అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు మరి కొన్ని గంటల్లో తీర్పు వెలువడబోతుండగా తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధవన్ పిటీషన్ దాఖలు చేశారు. అయోధ్య భూవివాదంపై తీర్పు వెలువడటానికి కొన్ని గంటల ముందు ఆయన ఈ పిటీషన్ దాఖలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో ముస్లింల తరఫున రాజీవ్ ధవన్ వాదనలు వినిపించారు. బాబ్రీ మసీదు స్థలం ముస్లిం వక్ఫ్ బోర్డుకు చెందుతుందని ఆయన వాదనలు కొనసాగించారు. రామజన్మభూమికి వ్యతిరేకంగా వాదనలను వినిపిస్తున్నందున చాలాకాలం నుంచీ తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని రాజీవ్ ధవన్ చెప్పుకొచ్చారు. ఈ సారి ఆయన లిఖితపూరకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చెన్నైకి చెందిన ఓ ప్రొఫెసర్ తనను బెదిరిస్తున్నారని అన్నారు. ఇదివరకు కూడా అదే ప్రొఫెసర్ నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని, ఈ విషయంలో బహిర్గతం కావడంతో ఆయన క్షమాపణ చెప్పారని అన్నారు.

తీర్పు వెలువడబోతున్న పరిస్థితుల్లో మరోసారి ఆ ప్రొఫెసర్ ఫోన్ చేసి బెదిరించారని రాజీవ్ ధవన్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో తుది విచారణ కొనసాగుతున్న సమయంలో హిందూ మహాసభ తరపు న్యాయవాది వికాస్ సింగ్ చేతుల్లో ఉన్న అయోధ్య రివిజిటెడ్ పుస్తకాన్ని, కొన్ని మ్యాపులను రాజీవ్ ధవన్ చించేసిన విషయం తెలిసిందే. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కునాల్ కిశోర్ రాసిన పుస్తకం అది. అందులోని కొన్ని అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయని ఇలాంటి పుస్తకాల మీద ఆధారపడి సుప్రీంకోర్టు చారిత్రాత్మక విషయాలపై ఓ అభిప్రాయానికి రాకూడదంటూ ఆయన వాదనలను వినిపించారు. తన వాదనల తీరు అభ్యంతరకరంగా ఉందంటూ చెన్నై ప్రొఫెసర్ తనను బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది.

Related posts