telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మర్కజ్ మసీదు ఘటనపై ఏఆర్ రెహమాన్ సందేశం

ar-rahman

మ‌త ప్రార్థనల కోసం గ‌త నెల‌ ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్‌లో ఉన్న మర్కజ్ మసీదుకు వెళ్లిన వారు ఇటీవ‌ల సొంత రాష్ట్రాల‌కి చేరుకున్నారు. వీరిలో చాలా మందికి క‌రోనా వైర‌స్ సోకింది. వీరి వల్ల వైరస్ ఇంకెంత మందికి వ్యాపిస్తుందో అని అధికార యంత్రాంగం బయపడుతోంది. మర్కజ్ మసీదులో జరిగిన జమాత్‌లో పాల్గొని వచ్చినవారి ఆచూకీ కోసం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు జల్లెడపడుతున్నాయి. వైరస్ విజృంభిస్తోన్న సమయంలో వందలాది మందితో ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించడం ఏంటని దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతోన్న వేళ ఈ ఘటనపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియా ద్వారా స్ప దించారు. దేవుడు మన హృదయంలోనే ఉన్నాడని మన హృదయమే అత్యంత పవిత్రమైన మందిరమని రెహమాన్ అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మతపరమైన ప్రదేశాల్లో జనాలు గుమిగూడి గందరగోళ పరిస్థితిని సృష్టించడం సరికాదన్నారు.

ఈ మేరకు మర్కజ్ వెళ్లివచ్చిన వారిని ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో భారీ మెసేజ్ పోస్ట్ చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పనిచేస్తోన్న డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్స్‌లో పనిచేస్తోన్న సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశ వ్యాప్తంగా హాస్పిటల్స్‌, క్లినిక్స్‌లో ఎంతో ధైర్యంగా, నిస్వార్థతతో పనిచేస్తోన్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు. ఈ భయంకరమైన మహమ్మారిని ఎదుర్కోవటానికి వారు ఎంత సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికీ తెలుసు. మన ప్రాణాలు కాపడటం కోసం వాళ్ల ప్రాణాలు పణంగా పెడుతున్నారు. పతపరమైన ప్రదేశాల్లో గుమిగూడి ఆందోళనకర పరిస్థితులను సృష్టించే సమయం ఇదికాదు. ప్రభుత్వ సూచనలను పాటించండి. కొన్ని వారలపాటు స్వయం నిర్బంధం పాటిస్తే ఎన్నో ఏళ్లు బతకొచ్చు. వైరస్‌ను మరింత వ్యాప్తి చేసి మన తోటి ప్రజలకు హాని కలిగించకండి. అని జమాత్‌కు వెళ్లిన వాళ్లను ఉద్దేశించి రెహమాన్ తన సందేశంలో పేర్కొన్నారు.

 

Related posts