telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తిరుమల ఘాట్ రోడ్లో విరిగిపడిన కొండ చరియలు..

తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు జారిపడుతున్నాయి. దీంతో ఘాట్ రోడ్డులో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో నానిపోయిన కొండ చరియలు బుధవారం ఉదయం తిరుమల ఘాట్ రోడ్ లో భారీ స్థాయిలో విరిగిపడ్డాయి.

ఆ సమయంలో ఓ ఆర్టీసీ బస్సును తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్ లో కొండ చర్యలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్న మరోపక్క పడిపోవడంతో అధికారులను ఇబ్బంది పెడుతుంది. 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు పూర్తిగా నాని పోయి విరిగి పడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఒకపక్క సహాయక చర్యలు చేపడుతున్న మరోపక్క విరిగిపడడం సవాల్ గా మారుతోంది.

ఘాట్ రోడ్డుకు అడ్డంగా బండరాళ్లు పడటంతో తిరుమలకు వెళ్లే వాహనాలు…. బారులు తీరి నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించి, లింకు రోడ్డు ద్వారా మొదటి ఘాట్ రోడ్డు ద్వారా తిరుమలకు పంపేందుకు చర్యలు చేపట్టారు. లింకురోడ్డు ద్వారా… దారిమళ్లించడం ఎంతవరకు సురక్షితమనే విషయంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

తుఫాను మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్లముందే మెదలాడుతున్నాయి. తాజాగా తిరుమల ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగి పడటంతో వాహనాలన్నీ ఆగిపోయాయి. తిరుమల తిరుపతి అటవీశాఖ విభాగం, ఇంజినీరింగ్ శాఖ అధికారులు స్పందించి కొండచరియలను రోడ్డుకు అడ్డంగా పడిన బండరాళ్లను తొలగించే ప్రయత్నం చేశారు. భారీ బండరాళ్లు రోడ్డుపై పడటంతో.. సగానికి పైగా రోడ్డు దెబ్బతింది. దీంతో వాహనాల రాకపోకలు ఇబ్బందికరమేనని అధికారులు చెబుతున్నారు.

పది రోజుల క్రితం భారీ వర్షాలు కురవడంతో రెండు రోజులపాటు ఘాట్ రోడ్డు మూసివేశారు. అంతా సజావుగా ఉందనుకుని ఘాట్ రోడ్ లను తిరిగి ఓపెన్ చేశారు. నిన్నటి వరకు ఎక్కడ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాజా ఘటన అధికారులను ఇబ్బంది పెడుతోంది. ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందోననే సందిగ్ధంలో అధికారులు మదనపడుతున్నారు.

యాత్రికులు కాలినడకన వెళ్లే మెట్ల మార్గంకూడా వర్షానికి దెబ్బతింది. వాటికి మరమ్మతు చేపట్టి ఆ మార్గాన్ని పునరుద్ధరించారు. తాజాగా ఘటన అధికారుల్లో ఆందోళన మొదలైంది. భారీ వర్షాలు పడడం వల్లే కొండచరియలు పూర్తిస్థాయిలో నాని పోవడం వల్లే వాటి పటుత్వం కోల్పోయి విరిగి పడుతున్నాయని ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఇప్పటికే ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే అలాంటి స్థావరాన్ని గుర్తించడం కష్టమేనని అధికారులు ఆలోచనలో పడ్డారు. కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాల్లో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. అడ్డంగా పడిన పెద్దచెట్లను నరికి పరిస్థితిని సరిదిద్ధే చర్యలు చేపట్టారు. జేసీబీ ప్రొక్లెయినర్ సాయంతో బండరాళ్లను రోడ్డుపైనుంచి తొలిగించారు. తిరుమల ప్రయాణంలో ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు, శ్రీవారి భక్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

Related posts