telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“తిప్పరా మీసం” మా వ్యూ

Thippara-Meesam

బ్యాన‌ర్స్‌ : రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్‌, కృష్ణ విజయ్ L ప్రొడక్షన్స్, శ్రీ ఓం సినిమా
న‌టీన‌టులు : శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి, రోహిణి త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం : కృష్ణ విజ‌య్‌.ఎల్‌
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : సిధ్
ఎడిటర్ : ధర్మేంద్ర కాకరాల
నిర్మాత‌ : రిజ్వాన్‌

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోలు అందరూ కమర్షియల్ సినిమాలతో ముందుకు వెళుతుంటే… యంగ్ హీరో శ్రీవిష్ణు మాత్రం వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా “తిప్పరా మీసం” అంటూ మరో సరికొత్త ప్రయత్నంతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీవిష్ణు. తల్లీకొడుకుల అనుబంధంపై ఈ చిత్రాన్ని దర్శకుడు కృష్ణ విజయ్ రూపొందించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ తెలుసుకుందాం.

కథ :
చిన్నప్పుడే చెడు స్నేహాల వల్ల డ్రగ్స్ కు బానిసవుతాడు మణి శంకర్ (శ్రీవిష్ణు). దీంతో అతన్ని డాక్టర్ సలహాతో రీహాబిలేషన్ సెంటర్ లో జాయిన్ చేస్తుంది తల్లి. తనను ఇలా దూరంగా ఉంచుతుందన్న కారణంతో తల్లి అంటే మణికి అసహ్యం ఏర్పడుతుంది. దీంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక పబ్ లో డీజేగా పని చేస్తున్నాడు. డబ్బుల కోసం స్నేహితులతో పందాలు కాసి ఓడిపోతాడు. అలా 30 లక్షల అప్పు పేరుకుపోతుంది మణి శంకర్ కు. అప్పు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మణిశంకర్ ను చంపేస్తామని బెదిరిస్తారు. అప్పుడు తల్లి దగ్గరకు వెళ్లిన మణి శంకర్ ఏం చేశాడు ? ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు ? వాటిని ఎలా పరిష్కరించగలిగాడు ? నిక్కీ తంబోలి పాత్ర ఏంటి ? చివరకు ఏం జరిగింది ? అనేది తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
శ్రీవిష్ణు మ‌రోసారి వైవిధ్యమైన పాత్రను సెలెక్ట్ చేసుకుని, తనదైన శైలిలో సహజ నటనను కనబరిచారు. పాత్ర ప‌రంగా చూస్తే ఎక్క‌డా ఓవ‌ర్ మాస్ ఎలిమెంట్స్‌, హీరోయిజం క‌న‌ప‌డదు. మ‌ణిశంక‌ర్ అనే పాత్ర‌లో శ్రీవిష్ణు చ‌క్క‌గా ఒదిగిపోయాడు. త‌ల్లిని ద్వేషించే కొడుకు పాత్ర‌లో, కుటుంబం కోసం నేర‌స్థుడిగా మారే కొడుకుగా శ్రీవిష్ణు త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక త‌ల్లి పాత్ర‌లో న‌టించిన రోహిణి తన పాత్రలో ఒదిగిపోయారు. హీరోయిన్ నిక్కీ తంబోలీ పాత్ర చాలా చిన్నది. కానీ ఆమె తన నటనతో ఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
ద‌ర్శ‌కుడు కృష్ణ విజ‌య్ తీసుకున్న పాయింట్ మంచిదే. కానీ దానిచుట్టూ అల్లుకున్న సన్నివేశాలను ఆసక్తికరంగా రాసుకోవడంలో తడబడ్డాడేమో అన్పిస్తుంది. సినిమా ఆఖరి 30 నిమిషాలు, ఇంటర్వెల్ సీన్ బాగున్నాయి. ఫస్టాఫ్‌లో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే కథనం కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది. దీనికితోడు సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచిందనే చెప్పొచ్చు. అయితే పాటలు పెద్దగా ఆకట్టుకోవు. సిద్ కెమెరా ప‌నితనం ఫర్వాలేదన్పిస్తుంది. క‌థ‌, క‌థ‌నం ఆస‌క్తిక‌రంగా ఉండుంటే సినిమా బావుండేది అన్న ఫీలింగ్ కలుగుతుంది. మొత్తానికి ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లే వాళ్ళను సినిమా ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 2.5/5

Related posts