telugu navyamedia
సినిమా వార్తలు

మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి బయోపిక్… రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు

The-Tashkent-Files

ప్రస్తుతం చిత్రసీమలో బియోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని బయోపిక్ లు విడుదల కాగా, మరికొన్ని చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. పదేళ్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా “ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్” సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీవితంపై “పీఎం నరేంద్రమోడీ” అనే బయోపిక్ నిర్మితమవుతోంది. ఈ బయోపిక్ ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా “జై జవాన్ జై కిసాన్” అనే నినాదాన్ని ఇచ్చిన మన దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మర్డర్ మిస్టరీపై “తాష్కెంట్ ఫైల్స్” అనే చిత్రం తెరకెక్కుతోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ ట్రైలర్లో లాల్ బహదూర్ శాస్త్రి రెండవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సన్నివేశాలు, ఆ తరువాత ఆయన చనిపోయిన సన్నివేశాలను చూపించారు. 1966 జనవరి 10న లాల్ బహదూర్ శాస్త్రి ఒకప్పటి రష్యా తాష్కెంట్‌లో పాకిస్థాన్‌తో శాంతి ఒప్పందం చేసుకున్నారు. ఆ పాత్రలపై సంతకాలు పెట్టిన కొన్ని గంటల్లోనే లాల్ బహదూర్ శాస్త్రి చనిపోవడం ఇప్పటికి మిస్టరీనే. ప్రస్తుతం ఈ ట్రైలర్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, నషీరుద్దిన్ షా, శ్వేతా బసు ప్రసాద్, మందిరా బేడి, పల్లవి జోషి, పంకజ్ త్రిపాఠి, రాజేష్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఏప్రిల్ 12న విడుదల చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఈ సినిమా కాంగ్రెస్ ను ఇరుకున పెడుతుందా ? ప్రజలను ఎంత మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.

Related posts