పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అంశంలో ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ ఎల్ పీ)ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
పోస్టల్ బ్యాలెట్ల ఓటరు డిక్లరేషన్కు సంబంధించిన ‘ఫాం-13ఏ’ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి ఆ అధికారి పేరు, హోదా, అధికారిక ముద్ర (సీలు) లేకున్నా ఆ ఓట్లు చెల్లుబాటవుతాయంటూ ఈసీ మే 30న జారీ చేయడం తెలిసిందే.
అయితే ఈ ఉత్తర్వులపై వైసీపీ తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలంటూ రిట్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వైసీపీ వాదనలను తిరస్కరిస్తూ జూన్ 1న తీర్పు వెలువరించింది.
అయితే హైకోర్టు తమ వాదనను పట్టించుకోలేదంటూ వైసీపీ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.