telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగు స్ఫూర్తికి కీర్తికీ  ఆభరణం కళాతపస్వి  విశ్వనాధ్

ఈరోజు దర్శకులు కాశీనాధుని విశ్వనాధ్ గారి పుట్టినరోజు . విశ్వనాధ్ గారంటే తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు . ఆయన తీసిన ఆణిముత్యాల్లాంటి చిత్రాలే చెరిగిపోని కీర్తిని సంపాదించిపెట్టాయి . తెలుగు సంస్కృతీ , సంప్రదాయాలను తన చిత్రాల ద్వారా న దశ దిశలా వ్యాప్తం చేసిన దర్శకుడు విశ్వనాధ్ . 2017  లో విశ్వనాధ్ గారికి భారత ప్రభుత్వం “దాదా సాహెబ్ ” అవార్డును ప్రకటించింది . 
మే  3వ తేదీన న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో  జాతీయ అవార్డుల కార్యక్రమంలో  పాల్గొనడానికి అవార్డు గ్రహీతలు,  జ్యూరీ కమిటీ సభ్యులు , ఎందరో మహనీయులు  విచ్చేశారు . హాలంతా నిండిపోయి వుంది . దర్శకులు విశ్వనాధ్ గారు తన శ్రీమతితో ఈ కార్యక్రమానికి వచ్చారు . విశ్వనాధ్ గారు దగ్గరకు  హిందీ హీరోలు అనిల్ కపూర్, అక్షయ్ కుమార్ , హీరోయిన్ సోనమ్ కపూర్  వచ్చి  శుభాకాంక్షలు తెలపడం అందరిని ఆకట్టుకుంది .
సాయంత్రం వేళ అవార్డుల కార్యక్రమం కన్నుల పండువగా జరపడానికి అప్పటి సమాచార శాఖా మంత్రి ఎమ్ . వెంకయ్య  నాయుడు గారు అన్ని ఏర్పాట్లు చేయించారు . జాతీయ అవార్డుల్లో దాదా సాహెబ్ అవార్డు ప్రతిష్టాత్మకమైనది . వెంకయ్య నాయుడు గారు మంత్రిగా ఉండాగా ఒక తెలుగువాడికి  , అందునా తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన దర్శకుడు విశ్వనాధ్ గారికి  ప్రదానం చెయ్యడం ఆయనకు మరింత సంతోషాన్ని కలిగించింది . 
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు రాగానే వారికి సంప్రదాయ పద్దతిలో వెంకయ్య నాయుడు గారు స్వాగతం పలికారు . అవార్డుల కార్యక్రమం  మొదలయ్యింది .  దర్శకులు విశ్వనాధ్ ను వేదిక మీదకుపిలిచారు   . విశ్వనాధ్ గారు వేదిక మీదకు రాగానే ముందు ఎదురు వచ్చి వెంకయ్య నాయుడుగారు విశ్వనాధ్ గారిని ఆప్యాయంగా ఆహ్వానించారు . ప్రణబ్ ముఖర్జీ గారు విశ్వనాధ్ గారితో కరచాలనం చేశారు. 
తరువాత విశ్వనాధ్ గారిని సత్కరించి  దాదా సాహేబ్ ఫాల్కే అవార్డును అందిస్తున్నప్పుడు సభలో వున్న వారందరూ లేచి చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారుఅవి అపూర్వమైన మధుర క్షణాలు  .జాతీయ అవార్డుల ప్రదానం సందర్భంగా అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి నమస్కారం పెట్టడం తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వడం ఉండదు .    విశ్వనాధ్ గారిని చిరునవ్వుతో ఆత్మీయంగా పలుకరించి షేక్ హ్యాండ్ ఇవ్వడం  అక్కడి ఆహుతులను తన్మయులను చేసింది .
 
అందుకు నేను ప్రత్యక్ష సాక్షిని . ఆ సంవత్సరం నేను జాతీయ సినిమా అవార్డుల కమిటీ సభ్యుడుగా పని చేశాను . జ్యూరీ సభ్యుడుగా అప్పుడు సభలో  వుండే అవకాశం , అదృష్టం కలిగింది . నిజంగా ఇది తెలుగు వారందరికీ గర్వకారణం . దర్శకులు  విశ్వనాథ గారితో నాకు 1980 లో  మొదటిసారి పరిచయం కలిగింది  .  వారు తీసిన శంకరాభరణం 1980 ఫిబ్రవరి 2న విడుదలయ్యింది . 
ఆ సందర్భంగా విశ్వనాధ్ గారు , జె.వి .సోమయాజులు, మంజు భార్గవి, ఏడిద నాగేశ్వర రావు గారు హైదరాబాద్ వచ్చి సరోవర్ హోటల్లో బస చేశారు . అప్పట్లో ఆంధ్ర కార్యాలయం సెక్రటేరియట్  ఎదురుగా మేడ మీద ఉండేది . నేను జ్యోతి చిత్ర పత్రికకు హైదరాబాద్ లో ఇంచార్జి గా ఉండేవాడిని. 
విశ్వనాధ్ గారు వచ్చారని తెలిసి నేను సరోవర్ హోటల్ కు  వెళ్ళాను  . అప్పుడు విశ్వనాధ్ గారిని కలసినప్పుడు వారు జేవీ సోమయాజులు గారిని పరిచయం చేశారు . అక్కడ నుంచి విశ్వనాధ్ గారి ఏ సినిమా విడుదలైనా హైద్రాబాద్లో జరిగే సమావేశానికి నా సహకారం అడిగేవారు . సినిమాచూసిన  తరువాత  రచయితలతో మాట్లాడించే సంప్రదాయం ఉండేది .Kviswanadh Movie Teaser Release
1980 నుంచి 86 వరకు నేను హైదరాబాద్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు కారదర్శిగా వున్నాను . జిఎస్ వరదాచారి గారు అధ్యక్షులు . 1986లో వారి స్వాతిముత్యం చిత్రం విడుదలైనప్పుడు  విశ్వనాధ్  గారిని , నిర్మాత ఏడిద నాగేశ్వర గావు గారిని , రాధిక గారిని ఫిలిం క్రిటిక్స్  సమావేశానికి ఆహ్వానించాము . హైదరాబాద్ బషీర్ బాగ్ లో వున్న ప్రెస్ క్లబ్ కు వారు వచ్చారు . ఆనాటి సమావేశాన్ని పాత్రికేయ మిత్రులంతా వచ్చారు . 
ఆ తరువాత సీనియర్ జర్నలిస్ట్ పి ఎస్ ఆర్ ఆంజనేయ శాస్త్రి  అవార్డును నాకు వాజపేయి సంస్థ వారు ప్రదానం చేశారు . 
26 సెప్టెంబర్ 2014న హైదరాబాద్ నిర్మాతల మండలి హాలులో ఈ కార్యక్రమం జరిగింది . విశ్వనాధ్ గారు , రమణా చారి గారు , రమేష్ ప్రసాద్ గారు , మురళి మోహన్ గారు , శేఖర్ బాబు గారు , వాజ్ పేయ్ ,  దీప్తి వాజపేయి ,కొడాలి వెంకటేశ్వర రావు, కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు వచ్చారు. 
విశ్వనాథ గారు అవార్డును నాకు ప్రదానం చేసి నా గురించి మాట్లాడారు . జర్నలిజం విలువలు కాపాడిన మిత్రులంటే తనకు అభిమానమని అందుకే ఈ సభకు వచ్చానని చెప్పారు . దర్శకుడుగా , నటుడిగా విశ్వనాధ్ తనదైన ముద్ర తెలుగు సినిమా మీద వేశారు . ఆయన చిత్రాలు ఎప్పటికీ తెలుగువారి మనస్సుల్లో నిలిచే ఉంటాయి 90 సంవత్సరంలో అడుగుపెడుతున్న విశ్వనాధ్ గారికి  “నవ్య మీడియా ” జన్మదిన శుభాకాంక్షలు . 
-భగీరథ 

Related posts