telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌” చిత్రం మా వ్యూ

Tenali

బ్యానర్ : ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌
నటీనటులు : సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్ కుమార్, వెన్నెల కిషోర్, మురళీశర్మ, రఘుబాబు, సప్తగిరి తదితరులు
దర్శకుడు : జి.నాగేశ్వ‌రరెడ్డి
సంగీతం : సాయి కార్తీక్
నిర్మాత : అగ్ర‌హారం నాగిరెడ్డి

ఇటీవల “నిను వీడని నీడను నేనే” అనే చిత్రంతో చాలా రోజుల తరువాత మంచి విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. గత కొంతకాలంగా కథల ఎంపిక విషయంలో పొరపాట్లు చేసిన సందీప్ ఇప్పుడు ఆచూతూచి కథలను ఎంపిక చేసుకుంటున్నారు. తాజాగా సందీప్ కిష‌న్ హీరోగా నటించిన చిత్రం “తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌”. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అనేది ట్యాగ్ లైన్‌. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంతో సందీప్ కిషన్ ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో తెలుసుకుందాం.

కథ :
తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌ (సందీప్ కిషన్) ఒక లాయర్. అయితే వాదించడానికి కేసులో రాకపోవడంతో చాలా ఆఫర్లు పెడతాడు. కానీ తన కొడుకు చిన్నాచితకా కేసులు వాదించకూడదని భావించిన తెనాలి తండ్రి దుర్గారావు (రఘుబాబు) కేసులు రాకుండా చేస్తుంటాడు. కేసులు రాక టైంపాస్ చేస్తున్న తెనాలి అదే కోర్టులో క్రిమినల్ లాయర్ చక్రవర్తి (మురళీశర్మ) కూతురు (హన్సిక)తో ప్రేమలో పడతాడు. కర్నూలు సిటీలో సింహాద్రి నాయుడు (అయ్యప్ప శర్మ), వరలక్ష్మీ దేవీ (వరలక్ష్మీ శరత్‌కుమార్)ల మధ్య ఆదిపత్య పోరు సాగుతుంది. రౌడీ అయిన సింహాద్రి నాయుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటాడు. కానీ ఇండస్ట్రియలిస్ట్‌ అయిన వర్మలక్ష్మీ తన సేవా కార్యక్రమాలతో జనానికి దగ్గరవుతుంది. అదే సమయంలో కర్నూలు సిటీలో జరిగిన ఓ జర్నలిస్ట్‌ హత్య కేసులో తనకు అడ్డుగా ఉన్న వరలక్ష్మీని ఇరికించాలనుకుంటాడు సింహాద్రి. అందుకు లాయర్‌ చక్రవర్తి కూడా సాయం చేస్తాడు. కానీ చివరి నిమిషంలో తెనాలి ఆమెను కేసులో నుంచి తప్పిస్తాడు. అసలు తెనాలి ఆమెను కేసులో నుంచి ఎందుకు తప్పించాడు ? అసలు నిజం ఏంటి ? ఆ జర్నలిస్ట్ ను ఎవరు హత్య చేశారు ? హత్య చేసింది ఎవరనే విషయం తెనాలికి ఎలా తెలిసింది ? ఆ తరువాత తెనాలి నిజాన్ని బయటపెట్టడానికి ఎదుర్కున్న పరిణామాలు ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
సందీప్‌ కిషన్‌ కామెడీ, యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టాడు. సినిమా అంతా తనే అయ్యి నడిపించడమే కాకుండా లాయర్ పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్ హన్సిక పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో నటించింది. అంతేకాదు చాలాకాలం తరువాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇక తమిళ నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ సినిమాలో సింగిల్‌ ఎక్స్‌ప్రెషన్‌ తో కన్పిస్తుంది. కానీ తన హుందాతనంతో ఆ పాత్రను నడిపించింది. ఇక మురళీ శర్మ, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, పోసాని కృష్ణమురళీ, సప్తగిరి, ప్రభాస్ శ్రీను తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
కామెడీ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమా విషయంలో మాత్రం తడబడ్డట్టుగా కన్పిస్తుంది. రొటీన్ సన్నివేశాలతో ప్రేక్షకులకు నీరసం వస్తుంది. కథనం అంత ఆసక్తికరంగా లేకపోవడం ప్రేక్షకుడిని నిరాశకు గురి చేస్తుంది. సాయి కార్తీక్‌ అందించిన పాటలు ఫరవాలేదు. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి బాగుంది. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లోకి అడుగుపెట్టే ప్రేక్షకులకు ఈ చిత్రం పర్వాలేదన్పిస్తుంది.

రేటింగ్ : 2/5

Related posts