telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలుగు అకాడమీ కేసులో దర్మాప్తు వేగ‌వంతం..

తెలుగు అకాడమీ కేసులో సీసీఎస్ పోలీసులు దర్మాప్తు వేగ‌వంతం చేశారు. రూ.63 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో సూత్రధారులుగా భావిస్తున్న మరో ఆరుగురిని సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. A1 మస్తాన్ వలీ, A2సోమశేఖర్ అలియాస్ రాజ్ కుమార్, A3 సత్యనారాయణ, A4 పద్మావతి, A5 మోహినుద్ధిన్, A6 వెంకట సాయి, A7 నండూరి వెంకట్, A8వెంకటేశ్వరరావు, A9 రమేష్, A10 సాధన ఉన్నారు. ఈ ముఠా గతంలోనూ పలు స్కాంక్‌లకు పాల్పడినట్లు తేల్చారు. యూబీఐ మేనేజర్ మస్తాన్ వలితో కుమ్మకైన నిందితులు తెలుగు అకాడమీ డిపాజిట్లు కాజేసినట్లు సీసీఎస్‌ పోలీసులు వెల్లడించారు.

జనవరి నుంచే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ముఠా సభ్యులు మళ్లించారు. యూబీఐ చీఫ్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ సాయంతో ముఠా అక్రమాలు జరిగాయి. ఎఫ్‌డీలను అగ్రసేన్‌ బ్యాంకులోని ఏపీ మర్చంటైల్‌ సొసైటీకి మళ్లించారు. కెనరా బ్యాంకులోని రూ.10 కోట్ల డిపాజిట్లను మళ్లించారు.

నేడు చంచల్ గూడ జైలు నుండి యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఏ-1 నిందితుడు మస్తాన్ వలీని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మస్తాన్ వలీని 7 రోజుల కస్టడీలోకి నాంపల్లి కోర్టు అనుతించింది. తెలుగు అకాడమీ నిధులు గోల్ మాల్‌పై మస్తాన్ వలీని పోలీసులు ప్రశ్నించనున్నారు. బదలాయించిన నిధులు ఎక్కడికి దారి మళ్లించారని ఆరా తీయనున్నారు. మరోవైపు నిధుల గోల్ మాల్‌పై ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించింది. మరికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ప్రస్తుతం జైల్లో ఉన్న ఏపీ మర్కంటైల్‌ కోఅపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ చైర్మన్‌ సత్యనారాయణ, మేనేజర్లు పద్మావతి, మొహినుద్దీన్‌ల కస్టడీపై కోర్టు నిర్ణయం గురువారానికి వాయిదా పడింది. 

 

Related posts