telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం..కొత్త జీవో జారీ

*ప్రభుత్వ వైద్యుల ప్రవేట్ ప్రాక్టీస్‌పై కొత్త జీవో జారీ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం..
*డాక్ట‌ర్ల స‌ర్వీస్ రూల్స్ ను స‌వ‌రించిన ప్ర‌భుత్వం..

*ద‌ర్యాప్తు చేయ‌కుండా సస్సెండ్ చేయ‌డం ఏంటి?
*ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో లోపాలు ఉన్న విష‌యం మంత్రి హ‌రీష్‌రావుకు తెలుసు..

ప్రభుత్వ వైద్యుల విషయంలో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ నిషేధం విధించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒక జీవో విడుదల చేసింది.

కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు.. ఇకపై ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ నిబంధనలను సవరించింది ప్రభుత్వం.

కాగా.. ప్రభుత్వ వైద్యులు తమ విధి నిర్వహణ అనంతరం ప్రైవేటు ప్రాక్టీసు చేసుకుంటున్నారు. ఈ కారణంగా చాలామంది వైద్యులు విధులు ఆలస్యంగా రావడం.. దీర్ఘకాలంపాటు సెలవులు పెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి.

దీనిపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసుకు దూరంగా ఉండాలనే నిబంధన విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరోవైపు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తీరుపై జూనియర్ డాక్టర్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. జూనియర్ వైద్యులను సస్పెండ్ చేయడాన్ని జూనియర్ డాక్టర్ల సంఘం ఖండించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వల్లే బయటకు పంపుతున్నామని,మందులు ఉన్నాయో లేదో చూసుకోవడం వైద్యుల పనికాదని జూడాల సంఘం వెల్లడించింది. ఔషధాల కోసం పంపే ప్రతిపాదనలు పట్టించుకోవడం లేదని ఆరోపించింది.

మందులు ఉన్నా బయటికి రాసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారా ? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందితేనే ప్రశ్నించే అర్హత ఉంటుందని వ్యాఖ్యానించింది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో లోపాల ఉన్న విష‌యం మంత్రి హరీశ్ రావుకు తెలుసని.. హరీశ్ రావు ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపింది.

Related posts