telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కాసుల కోసమే.. కార్పొరేట్ విద్యాసంస్థల విద్యా వ్యాపారం :ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శెఖర్ రావు

కాసుల కోసం ముందస్తు క్లాసులు అంటూ కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యాపారం చేస్తున్నాయని ట్రస్మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శెఖర్ రావు ఫైర్ అయ్యారు. కార్పొరేట్ విద్యాసంస్థల చెలగాటం తల్లిదండ్రులకు ప్రాణసంకటమని.. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల అయోమయ స్థితి నేటి కార్పొరేట్ మాయాజాలానికి నిలువుటద్దంగా నిలుస్తుందని మండిపడ్డారు. అంకెల గారడీతో మాయమాటలతో విద్యార్థుల భవిష్యత్తు బేజారు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై అత్యంత జాగ్రత్త అవసరమని.. వందల సంఖ్యలో బ్రాంచీలను తీరుస్తూ లక్షలాది మంది విద్యార్థులను తల్లిదండ్రులను వారి మాయమాటలతో మభ్యపెడుతూ అడ్మిషన్లు పొందటం వీరి ప్రత్యేకత అని పేర్కొన్నారు.

అన్ని రంగాలలో ఉన్న ప్రజలను ఉన్న అనేక ఆశలు చూపి వారిని పి ఆర్ వో లు గా పిలుస్తూ రాష్ట్ర నలుమూలల నుండి అడ్మిషన్లు పొందటమే వీరి ధ్యేయమని తెలిపారు. ఒక ప్రాంగణంలో వివిధ రకాల వైవిధ్యమైన క్యాంపస్ పేర్లు పెడుతూ వాటికి వేరువేరుగా ఫీజులు వసూలు చేస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలు కొత్త తరహా దోపిడీకి తెరలేపాయి అని ఫైర్ అయ్యారు. ఒక బ్రాంచ్ లో చేరిన విద్యార్థి సామర్థ్యం అమోఘంగా ఉంది అంటూ పేరెంట్స్ కి ఫోన్ చేసి వారిని మరింత మెరుగైన విద్య కొరకు వేరొక క్యాంపస్ కు పంపటం వీరికి సర్వసాధారణమన్నారు. క్యాంపస్ మారిన విద్యార్థుల నుండి అదనంగా లక్ష రూపాయలు గుంజటం వీరి ధనార్జనకు నిర్వచనమని… మొట్ట మొదటగా పిల్లల మార్కుల జాబితాను సంపాదించి వారి భవిష్యత్ తరాలకు అవసరమైన ఉన్నత విద్య అందిస్తామంటూ తల్లిదండ్రులను మభ్యపెట్టడంతో వీరి కాసుల రాజ్యం మొదలవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భవిష్యత్తు బంగారం ఏం చేస్తాం IIT ,NEET, JEE వంటి ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల ప్రవేశాల కొరకు సీట్లు సంపాదించటానికి నేటి నుండి సిద్ధం కావాలి, లేకపోతే విద్యార్థులు వెనుకబడి పోతారు భవిష్యత్ అంధకారం అవుతుంది అంటూ విద్యార్థులను తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేయడంలో వీరు నిష్ణాతులు అని పేర్కొన్నారు.
ఇందు కొరకు ఆరో తరగతి నుండే ఒలంపియాడ్ సెక్షన్ల పేరుతో లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు మానసిక స్థితిగతులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, LEO, NEO తదితర గ్రూపులు అంటూ వివిధ కరికులం పేరిట విపరీతమైన ఒత్తిడికి గురి చేయటం ఈ విద్యా సంస్థలకు అలవాటుగా మారింది. ఒత్తిడి భరించలేని పిల్లలు ఇటు చదవలేక తల్లిదండ్రులు చెప్పలేక అశక్తుడై ఆత్మహత్యలు చేసుకోవడం లేదాఆత్మన్యూనతతో బతుకుతున్న పరిస్థితులు మనం గమనిస్తున్నామని తెలిపారు.

పి ఆర్ వో ల మాటల గారడిని గుడ్డిగా నమ్మి తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు పై ఆశతో వీరికి లక్షలాది రూపాయల ఫీజు రూపంలో చెల్లిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని.. వాస్తవానికి వేల మంది విద్యార్థులు ఉండే క్యాంపస్ లో కేవలం పదుల సంఖ్యలో కూడా ర్యాంకులు రావడం లేదన్నారు. వచ్చే ఆ కొద్దిపాటి ర్యాంకులను 1,1,2,2,3,3,4,5,6, 6 అంటూ మీడియాలో కోట్ల రూపాయల ఖర్చుతో ప్రకటనలు గుప్పిస్తూ అందరినీ మోసం చేస్తున్నారని.. పరీక్ష రాసిన వారు ఎంత పాస్ ఎన్ని ర్యాంకులు ఎన్ని అనే కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ క్యాంపస్ వారీగా ఎప్పుడూ చెప్పరు ఇది బ్రహ్మ రహస్యంగానే ఉండిపోయిందని వెల్లడించారు. పూర్తి స్థాయి సిబ్బందితో కాకుండా కేవలం అతి కొద్దిమంది అధ్యాపకులతో పాఠాలు చెప్పించి పిల్లల అందరి వద్ద 100% ఫీజులు వసూలు చేస్తున్నారని.. లక్షల రూపాయలు ఫీజులు తీసుకున్నప్పటికీ లాక్డౌన్ కాలంతో మాత్రమే కాకుండా గతంలో కూడా అరకొర సౌకర్యాలు అతి తక్కువ నిర్వహణ వీరు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చని విమర్శలు చేశారు.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఫీజులకు మాత్రమే కార్పొరేట్ వసతులు సౌకర్యాలు అత్యల్పమని చురకలు అంటించారు.
ఫీజులు ఫుల్ ప్రత్యేకతలు నిల్. ఆటపాటలు కౌన్సిలింగ్ కమ్యూనికేషన్ తదితర అత్యవసరమైన సామర్థ్యాలు కార్పొరేట్ విద్యాసంస్థల పిల్లలకు అందని ద్రాక్ష అని తెలిపారు. రేపటి తరం భరతమాత ముద్దుబిడ్డ లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది అని గుర్తు చేస్తూ ప్రభుత్వాలు కాదు విజ్ఞులైన తల్లిదండ్రులు జాగ్రత్త వహించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ కార్పొరేటర్ మాయాజాలంలో పడి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయవద్దని ప్రేమతో హెచ్చరిస్తున్నామని యాదగిరి శెఖర్ రావు తెలిపారు.

Related posts