కేరళ రాష్ట్రానికి విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు. కరీంనగర్‌కు చెందిన విద్యార్థి హర్ష కోయంబత్తూరులోని అమృత పీఠం ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 13న కళాశాలకు చెందిన 60 మంది విద్యార్థులు టూర్‌కు వెళ్లారు. ఈ క్రమంలో కొట్టాయం వద్ద మర్రి మాల్ జలపాతం వద్ద హర్ష ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. వెంటనే జాలర్లు రంగంలోకి దిగి శ్రీహర్ష మృతదేహాన్ని వెలికితీశారు. కుమారుడి మరణవార్త తెలిసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.