telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ’ కి ఛైర్మన్గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి ఛైర్మన్గా వ్యవహరించడానికి ఆనంద్ మహీంద్రా అంగీకరించారని, కొద్ది రోజుల్లోనే వారు బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.

తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న వ్యక్తిని అధినేతగా నియమిస్తామని ముఖ్యమంత్రి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు.

ఆనంద్ మహీంద్రా ఇటీవల హైదరాబాద్ లో ముఖ్యమంత్రితో సమావేశమైన సందర్భంలోనూ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీపై చర్చలు జరిపారు.

రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ పరిధిలో బ్యాగరికంచె వద్ద తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి గతవారం శంకుస్థాపన చేశారు.

యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో ఏటా 20 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్ ఇవ్వడంతోపాటు ఆయా కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ఏర్పాటు చేశారు.

రాబోయే సంవత్సరాల్లో ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా స్కిల్ వర్సిటీని విస్తరించనున్నారు.

బ్యాగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) భవంతి నుంచి స్కిల్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

స్కిల్ యూనివర్సిటీ కోసం మొత్తం 57 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. రూ.100 కోట్ల నిధులను సైతం విడుదల చేశారు. వచ్చే ఏడాది వర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.

Related posts