telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణ‌యం : టీచ‌ర్ల ఆస్తులు వివ‌రాలు ప్రకటించాలని ఆదేశాలు

*తెలంగాణ పాఠ‌శాల విద్యాశాఖ కీల‌క ఆదేశాలు జారీ
*టీచ‌ర్ల ఆస్తులు వివ‌రాలు కోరిన తెలంగాణ విద్యాశాఖ‌
*ఏడాదికొసారి ఆస్తులు వివ‌రాలు స‌మ‌ర్పించాలి.
*ఇక‌పై ఇళ్ళు , ఆస్తులు కోనాల‌న్నా , అమ్మాల‌న్నా సంబంధిత అధికారుల‌కు చెప్పాలి

తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ టీచర్లు ప్రతి ఏడాది తమ ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మినా, కొన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలని విద్యాశాఖ చెప్పినట్లు సమాచారం.

టీచర్లు వార్షిక ప్రాపర్టీ స్టేట్‌మెంట్‌ను విద్యాశాఖకు సమర్పించాలని ఆదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి టీచర్లు, ఉద్యోగులకు ఆదేశాలు ఇవ్వాలని ఆర్జేడీ, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. నల్గొండ జిల్లాలో ఓ టీచర్ వ్యవహారంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

2021లో నల్గొండ జిల్లా దేవరకద్ర మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్‌ ఆలీ పాఠశాల విధులకు హాజరు కాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, వక్ఫ్​ బోర్డు సెటిల్​మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని  ఆరోపణలు వ‌చ్చాయి.విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్.. జావీద్ అలీపై ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని నిర్ధారించింది.

అంతేకాదు.. జావేద్‌ అలీపై చర్యలతో పాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులందరికీ సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలని గతేడాది ఏప్రిల్‌లో విజిలెన్స్‌ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరు ఉండాలని .. ఉద్యోగులు ఏటా ఆస్తుల వివరాలు సమర్పించడంతో పాటు, స్థిర..చరాస్తి క్రయ విక్రయాలకు ముందస్తు అనుమతి పొందేలా చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొంది. ఈ సిఫారసులను పరిగణనలోనికి తీసుకున్న పాఠశాల విద్యాశాఖ ఈమేరకు పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts