తెలంగాణలోని గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉపసర్పంచులకు ఉమ్మడి చెక్‌పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు పంచాయతీరాజ్ చట్టంలో మార్పులకు నిర్దేశించిన అంశాలపైనా ఆదేశాలు ఇచ్చింది. ఇవన్నీ ఈ నెల 17 నుంచి అమలులోకి వస్తాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం గ్రామపంచాయతీల నిధులకు సంబంధించిన చెక్ పవర్ సర్పంచి, ఉపసర్పంచులకు ఉమ్మడిగా ఉంటుంది.
ఇంతకముందు సర్పంచికి, కార్యదర్శికి కలిపి చెక్ పవర్ ఉండేది. పంచాయతీ నిధుల ఆడిటింగ్ సర్పంచి, గ్రామ పంచాయతీ కార్యదర్శి చేయాలి. గతంలో ఈ బాధ్యత కార్యదర్శికి ఉండేది. నిర్ణీత కాలంలో ఆడిటింగ్ చేయని సర్పంచి, కార్యదర్శులను బాధ్యతల నుంచి తొలగిస్తారు. బాధ్యతలు, విధులు సరిగా నిర్వర్తించని సర్పంచులు, కార్యదర్శుల తొలగింపు విషయమై ఫిర్యాదులు, అప్పీళ్ల కోసం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు.