తెలంగాణ సర్కారు ఎన్ని ప్రకటనలు చేసినా ఇప్పటివరకు కనీసం 300 మంది కూడా తిరిగి ఆర్టీసీలో చేరలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. దీంతో చేరిన వారికి కూడా డ్యూటీలు వేసే పరిస్థితి లేదని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలంటే అందుకు కేంద్ర సర్కారు అనుమతి అవసరమని అన్నారు. కార్మికులు 33 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
తమతో ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు. అలాగే సమస్య పరిష్కరానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన మిలియన్ మార్చ్‌కు బీజేపీ మద్దతు ఇచ్చిందని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తాము సమస్యను వివరించామని చెప్పారు. తమపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే కుదరదని, తమకు న్యాయం చేసేందుకు న్యాయస్థానాలు ఉన్నాయని అన్నారు.